Silver: ఇప్పుడు వెండి వంతు.. కేంద్ర ప్రభుత్వ కఠిన ఆంక్షలు!
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పెరిగిన దిగుమతి బిల్లును నియంత్రించేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. 99.9 శాతం స్వచ్ఛత గల వెండి బార్‌ల దిగుమతిని నియంత్రిత వర్గంలోకి మార్చింది. బంగారం, వెండి, ప్లాటినం దిగుమతి సుంకాలను గణనీయంగా పెంచింది. అడ్వాన్స్ ఆథరైజేషన్ పథకం కింద బంగారం దిగుమతులకు 100 కిలోల పరిమితి విధించింది.

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో పెరుగుతున్న దిగుమతి బిల్లును నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ అఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) తాజా నోటిఫికేషన్ ద్వారా కొన్ని వర్గాల సిల్వర్ బార్‌ల దిగుమతిని తక్షణమే నియంత్రిత వర్గంలోకి మార్చింది. సవరించిన దిగుమతి విధానం ప్రకారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన వెండి బార్‌లు ఇకపై స్వేచ్ఛా దిగుమతి కేటగిరీలో ఉండవు. వీటిని నియంత్రిత దిగుమతి వర్గంలో చేర్చారు. అదేవిధంగా మరికొన్ని ప్రత్యేక వెండి బులియన్ ఉత్పత్తుల దిగుమతులపై కూడా పర్యవేక్షణను కఠినతరం చేశారు.
దేశంలోకి భారీగా ప్రవేశిస్తున్న విలువైన లోహాల దిగుమతులను పర్యవేక్షించడం, విదేశీ మారకద్రవ్య వ్యయాన్ని తగ్గించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే కేంద్రం బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను భారీగా పెంచింది. మే 13 నుంచి అమల్లోకి వచ్చిన తాజా నిర్ణయం ప్రకారం, బంగారం, వెండిపై దిగుమతి సుంకం 6 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది. అలాగే ప్లాటినంపై సుంకాన్ని 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచారు. ఈ పెంపు ప్రభావం బంగారం, వెండి నాణేలు, డోర్, ఫైండింగ్స్ వంటి అనుబంధ ఉత్పత్తులపై కూడా పడుతోంది.
ఇదే సమయంలో ఎగుమతిదారులకు ముడి పదార్థాలను సున్నా సుంకంతో దిగుమతి చేసుకునే అవకాశం కల్పించే అడ్వాన్స్ ఆథరైజేషన్ పథకంపై కూడా ప్రభుత్వం పరిమితులు విధించింది. ఈ పథకం కింద బంగారం దిగుమతులకు ఇకపై 100 కిలోల పరిమితి అమల్లో ఉంటుంది. అంతకుముందు ఈ పథకంలో పరిమితి లేకపోవడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల దేశ ప్రజలను అనవసరమైన బంగారం కొనుగోళ్లను తగ్గించాలని కోరిన నేపథ్యంలోనే ఈ నిర్ణయాలు వెలువడడం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరగడం, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి అధికమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విలువైన లోహాల దిగుమతులను నియంత్రించే దిశగా అడుగులు వేస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
