RBI pulls out over 900 mn notes of Rs. 2,000 denomination : భారతదేశపు అతి ఎక్కువ విలువ కలిగిన 2 వేల రూపాయల కరెన్సీ నోటును క్రమ క్రమంగా చలామణీ నుంచి తప్పిస్తున్నారు. దీంతో పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన మరో పెద్ద నోటుకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుంది. ఇప్పటికే రూ.2,000 నోట్లను దాదాపు రెండేళ్ళ నుంచి కొత్తగా ముద్రించడం మానేశారు. ఇకిప్పుడు పూర్తిగా దీనిని చలామణీ నుంచి తప్పించడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. భారతీయ రిజర్వు బ్యాంకు గురువారం విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.57,757 కోట్ల విలువైన రూ.2,000 నోట్లను చలామణీ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో చలామణీలో ఉన్న రూ.2,000 నోట్ల విలువ రూ.5,47,952 కోట్లు కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ రూ.4,90,195 కోట్లు అని రిజర్వ్ బ్యాంకు నివేదిక ప్రకారం తేటతెల్లమవుతోంది.