ఇటీవల ఢిల్లీ కోర్టు నకిలీ 2000 రూపాయల నోట్లను కలిగి ఉండడంతో పాటు ఉపయోగించిన ఇద్దరి వ్యక్తులకు శిక్ష ఖరారు చేసింది. ఐపీసీ సెక్షన్ 489 బి (నిజమైన, నకిలీ లేదా నకిలీ కరెన్సీ నోట్లు లేదా బ్యాంకు నోట్లను ఉపయోగించడం), సెక్షన్ 489 సి (నకిలీ లేదా నకిలీ నోట్లను కలిగి ఉండటం) కింద కోర్టు చర్యలు తీసుకుంది. వీరిద్దరి నుంచి పోలీసులు 2000 రూపాయల 29 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోటును ముద్రించడం ఎంత నేరమో? అవి మన ఉన్నాయని తెలిసి వాటిని సైలెంట్‌గా చలామణి చేయడం కూడా అంతే నేరమని భారతీయ చట్టాల ద్వారా తెలుస్తుంది. భారతదేశంలో నకిలీ కరెన్సీని ఉపయోగించడం, తయారు చేయడం, చలామణి చేయడం లేదా కలిగి ఉండటం వంటి వాటిని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు.
నకిలీ నోటు తయరు చేసినా, చలామణి చేసినా భారత శిక్షాస్మృతి (ఐపీసీ) ప్రకారం పలు శిక్షలను విధించడంతో పాటు జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. ఐపీసీలోని సెక్షన్ 489 ఏ ప్రకారం నకిలీ నోట్లను తయారు చేస్తే జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. అలాగే సెక్షన్ 489 బీ ప్రకారం నకిలీ నోట్లను ఉపయోగించడం లేదా చలామణి చేయడానికి ప్రయత్నించినా జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. సెక్షన్ 489 సీపీ నకిలీ నోట్లు అని తెలిసి ఎవరైనా వ్యక్తి వాటిని వారి దగ్గరే ఉంచుకుంటే ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
అలాగే సెక్షన్ 489డీ ప్రకారం నకిలీ నోట్లను ముద్రించడానికి పరికరాలు లేదా ప్లేట్లను తయారు చేయడం లేదా కలిగి ఉంటే దీనికి జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. అయితే సెక్షన్ 489 ఈ నిజమైన కరెన్సీ నోట్లను పోలిన ప్రకటనలు, పత్రాలు లేదా సామగ్రిని ముద్రిస్తే దీనికి 6 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో నకిలీ నోట్లను ఉపయోగిస్తుంటే ఉగ్రవాద నిరోధక చట్టాల (UAPA, PMLA) కింద కూడా చర్యలు తీసుకోవచ్చు. నకిలీ కరెన్సీకి సంబంధించిన కేసులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ ) చట్టం, 1934 కింద దర్యాప్తు చేయవచ్చు
అనుకోకుండా మీ దగ్గర ఉన్న సొమ్ములో నకిలీ నోట్ వస్తే వెంటనే సమీపంలోని బ్యాంకు లేదా పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది. నకిలీ నోటును మరెవరికీ ఇవ్వడం లేదా ఉపయోగించడం మానుకోవాలి. ఎందుకంటే ఇది కూడా నేరం. బ్యాంకు ఆ నకిలీ నోటును స్వాధీనం చేసుకుని పోలీసులకు, ఆర్‌బీఐకు తెలియజేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి