స్టాక్ మార్కెట్లు కొత్త గరిష్టాలను తాకడంతో 2023 సంవత్సరం పెట్టుబడిదారులకు విశేషమైన రాబడిని అందించింది. స్టాక్ మార్కెట్లలో బుల్ రన్ మధ్య పెట్టుబడిదారులు వివిధ ఆస్తుల తరగతులలో గణనీయమైన లాభాలను ఆర్జించారు. బంగారం, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రెండూ పెట్టుబడిదారులకు సంపదను కూడగట్టుకోవడానికి దోహదపడ్డాయి. కీలకమైన బెంచ్‌మార్క్ సూచీలు, నిఫ్టీ, సెన్సెక్స్ కొత్త గరిష్ట స్థాయికి చేరుకోగా బంగారం ధర కూడా 2023లో తొలిసారిగా రూ.60,000 మార్క్‌ను అధిగమించింది. జనవరి 5తో ముగిసిన కొత్త సంవత్సరం మొదటి వారంలో బెంచ్‌మార్క్ సూచీలు స్వల్పంగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో 2024 పెట్టుబడిదారులు బంగారం లేదా షేర్లపై ఎక్కువ పెట్టుబడి పెట్టాలా? అనే అంశంపై గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి 2024 బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ గురించి ఓ సారి తెలుసుకుందాం.
బెంచ్‌మార్క్ సూచీలు, నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా 18 శాతం-20 శాతం లాభాలతో 2023 ముగిశాయి. స్టాక్ పెట్టుబడులు పెట్టుబడిదారులకు గణనీయమైన రాబడిని అందించినప్పటికీ 2023లో బంగారం కూడా 15 శాతం రాబడిని ఇచ్చింది. ఇప్పుడు పెట్టుబడిదారులు బంగారం మరియు స్టాక్స్ రెండింటిలో పెట్టుబడులపై అధిక రాబడి సంభావ్యతను విశ్లేషిస్తున్నారు. అయితే సరైన పెట్టుబడి ఎంపికను ఎంచుకునే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.
ఈక్విటీ, స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం కీలకమైన బెంచ్‌మార్క్ సూచీలు, నిఫ్టీ, సెన్సెక్స్ 2024లో అద్భుతమైన పనితీరుకు సిద్ధంగా ఉన్నాయి. సంవత్సరం చివరి నాటికి సెన్సెక్స్ 83.250 స్థాయిని అధిగమించవచ్చని, నిఫ్టీ 25,000ను అధిగమించవచ్చని అంచనా వేస్తున్నారు. జనవరి 8 నాటికి సెన్సెక్స్ 71,355.22 వద్ద ముగియగా, నిఫ్టీ 21,513 వద్ద ముగిసింది. నిపుణుల అంచనాలు నిజమైతే పెట్టుబడిదారులు 2024లో దాదాపు 12,000 పాయింట్ల పెరుగుదలను చూడవచ్చు, ఇది దాదాపు 14.41 శాతం రాబడికి సమానం.
ప్రస్తుతం ఉన్న ప్రపంచ మార్కెట్ పరిస్థితి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా 2024లో బంగారం ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2023లో బంగారం ధర తులానికి రూ. 63,203 వద్ద ముగిసింది. పెట్టుబడిదారులకు 14.88 శాతం అద్భుతమైన రాబడిని అందించింది. ఫిబ్రవరి 5, 2024న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్‌లో రూ. 182 లేదా 0.29 శాతం తగ్గిన తర్వాత 10 గ్రాములకు రూ.62,511గా ఉంది. అంతకు ముందుకు ముగింపు రూ.62,557గా నమోదైంది.
స్టాక్ మార్కెట్, బంగారం రెండూ 2024లో రెండంకెల రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎక్కువ రిస్క్ ఫేస్ చేయాలనుకునే పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్‌కి ఎక్కువ నిధులను కేటాయించవచ్చు. అయితే రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టేవారు స్టాక్స్ వైపు మొగ్గు చూపేబదులు బంగారాన్ని ఎంచుకోవచ్చు. కొనసాగుతున్న గ్లోబల్ మార్కెట్ అనిశ్చితి దృష్ట్యా బంగారం మరింత విశ్వాసాన్ని కలిగిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..