
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల గుండా కూడా నాలుగు కారిడార్లు వెళ్లనున్నాయి. హైదరాబాద్-పుణె, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, బెంగళూరు-చెన్నై కారిడార్లతో తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ క్రమంలో హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్‌పై కీలక అప్డేట్ వచ్చింది. ఈ కారిడార్ నిర్మించేందుకు భూసేకరణ, అలైన్‌మెంట్‌పై కర్ణాటక ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చల తర్వాత ప్రాజెక్టుపై వేగం పుంజుకుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు కారిడార్‌గా ఇది నిలవనుంది. ఇది పూర్తైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతో పాటు సరుకు రవాణా వేగవంతం కావడం వల్ల కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశముంది.
హైదరాబాద్-బెంగళూరు వరకు 626 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ ఉంటుంది. ఇది పూర్తైతే ఈ రెండు నగరాల మధ్య 2 గంటల్లోనే ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న రైళ్ల ద్వారా హైదరాబాద్, బెంగళూరు మధ్య జర్నీకి 8 నుంచి 19 గంటలు పడుతుంది. ఇక వందే భారత్ రైళ్ల ద్వారా 8 గంటల్లో వెళ్లవచ్చు. ఇక ఫ్లైట్ల ద్వారా గంట 15 నిమిషాల్లో ప్రయాణం చేయవచ్చు. అయితే బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల్లోనే ప్రయాణం చేయవచ్చు.
ఈ హైస్పీడ్ రైలు కారిడార్‌లో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో మొత్తం 12 స్టేషన్లు ఉండనున్నాయి. కర్ణాటకలోని అలిపుర, దేవనహళ్లి, కోడిహళ్లి రైల్వే స్టేషన్లు ఉంటాయి. ఈ కారిడార్లలో గంటకు 320 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైళ్లు నడుస్తాయి. ఎలివేటెడ్ కారిడార్లపై ఈ బల్లెట్ రైళ్లకు ట్రాకులు నిర్మిస్తారు. ఈ కారిడార్‌కు సంబంధించి మార్చి వరకు డీపీఆర్ రెడీ కానుండగా.. రైట్స్ సంస్థ తుది సర్వే నిర్వహిస్తోంది. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ కోసం నోడల్ అధికారినిన నియమించాలని కర్ణాటక ప్రభుత్వానికి కేంద్రం కోరింది. దీంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని కర్ణాటక మౌలిక సదుపాయాల అభివృద్ది మంత్రి ఎంబి పాటిల్ తెలిపారు. అటు హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు మార్గం పనులు కూడా వేగవంతంమయ్యాయి. త్వరలోనే డీపీఆర్ సిద్దం చేయనుండగా.. ఆ తర్వాత భూసేకరణ ప్రక్రియకు రైల్వేశాఖ శ్రీకారం చుట్టనుంది. ఇక మిగతా కారిడార్ల పనులపై కూడా రైల్వేశాఖ వేగం పెంచనుంది. అటు ఏపీలో ఇప్పటికే విజయవాడ-విశాఖపట్నం మధ్య మరో హైస్పీడ్ బుల్లెట్ రైలు కాారిడార్‌ను రైల్వేశాఖ ప్రతిపాదించింది.