
ఐఫోన్ల ఎగుమతుల్లో మన దేశం ఒక గొప్ప మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం (ఎఫ్ వై25)లోని మొదటి పది నెలల్లోనే వాటి విలువ ఒక ట్రిలియన్ దాటింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి ఘనత సాధించడం ఆపిల్ కంపెనీకి ఇదే మొదటిసారి. మొత్తానికి లెక్కిస్తే మన దేశం నుంచి ఆపిల్ ఎగుమతులు 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి మధ్య 31 శాతం ఎదుగుదలను నమోదు చేశాయి. వాటి విలువ సుమారు రూ.76 వేల కోట్లకు చేరుకుంది. ఒక్క జనవరిలోనే రూ.19 వేల కోట్ల విలువైన ఎగుమతులు జరగడం విశేషం. భారత దేశం నుంచి ఐఫోన్ల ఎగుమతులు పెరగడానికి వివిధ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మన దేశంలో ఐఫోన్లను అసెంబుల్ చేసే ఫాక్స్ కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, పెగాట్రాన్ సంస్థలతో ఆపిల్ భాగస్వామ్యం కావడం ముఖ్య కారణం. 2024 డిసెంబర్ లో రూ.14 వేల కోట్ల ఉత్పత్తి జరగ్గా, తర్వాత నెల అయిన జనవరిలో రూ.19 వేల కోట్లకు ఆ విలువ పెరగడం విశేషమే.
ఆపిల్ ఫోన్ల ఎగుమతుల్లో 2024 అక్టోబర్ నుంచి గణనీయమైన పెరుగుదల నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ 16 విడుదల అయినప్పటికీ నుంచి ఆదరణ పెరిగింది. ఆ ఫోన్ ను మన దేశంలో కూడా తయారు చేశారు. అప్పటి నుంచి ఎగుమతులు నిలకడగా పెరుగుతూ రూ.10 వేల కోట్ల కు చేరాయి. దీంతో 2025 ఆర్థిక సంవత్సరంలోని మొదటి పది నెలల్లోనే రికార్డు స్థాయిలో ఒక ట్రిలియన్ విలువైన ఎగుమతులు జరిగాయి.
ఉత్పత్తి – సంబంధిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం తోనే మన దేశం నుంచి ఐఫోన్ల ఎగుమతులకు గణనీయమైన ప్రోత్సాహం లభించింది. ఆపిల్ కంపెనీ తన చైన్ ను చైనా నుంచి దూరంగా విస్తరణ చేసింది. ఫలితంగా మన దేశానికి ప్రాధాన్యం లభించింది. ఆ పథకం కారణంగానే ప్రపంచంలోని టెక్ దిగ్గజాలు చైనా నుంచి మన దేశానికి తరలివచ్చాయి. ఇక్కడి నుంచి ఎగుమతులు విపరీతంగా పెరగడానికి కారణమైంది. స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో మన దేశం 2015లో 167 ర్యాంకులో ఉండేది. ప్రస్తుతం ప్రపంచంలోనే రెండు అతి పెద్ద ఎగుమతిదారుగా మారింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి