క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ అనేది మీ క్రెడిట్ చరిత్రను చూపే ఇండెక్స్. అంటే మీ డబ్బు – అప్పులను నిర్వహించే రికార్డు. ఇది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 750 కంటే ఎక్కువ స్కోరు మంచిగా పరిగణిస్తారు. 550 నుంచి 750 మధ్య స్కోరు ఫర్వాలేదు అని చెబుతారు. 549 కంటే తక్కువ స్కోరు చెడ్డదిగా లేదా తక్కువ క్రెడిట్ స్కోర్ గా చెబుతారు. క్రెడిట్ స్కోర్ 900కి దగ్గరగా ఉంటే, లోన్ పొందే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. కొన్ని చిట్కాల ద్వారా తక్కువ క్రెడిట్ స్కోర్‌ని మెరుగుపరచవచ్చు. మీకు ఏదైనా పెండింగ్ లోన్ ఉంటే అది సిబిల్ స్కోర్‌లో కనిపిస్తుంది. మీరు దాన్ని చెల్లించకపోతే అది మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. క్రెడిట్ స్కోర్‌ని మెరుగుపరచడానికి, బకాయి ఉన్న లోన్ తిరిగి చెల్లించడం అవసరం. మీరు బకాయి ఉన్న మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి మీ పరిస్థితి గురించి బ్యాంక్‌కి చెప్పడం ద్వారా అదనపు సమయం కోరవచ్చు. బాకీ ఉన్న అప్పులను క్రమంగా తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. లోన్ EMI లేదా క్రెడిట్ కార్డ్ బిల్లు తరచుగా సకాలంలో పేమెంట్ చేయకపోతే ఇది క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది.
అటువంటి పరిస్థితిలో మీరు సమయానికి EMI చెల్లించడం చాలా ముఖ్యం. ఈఎంఐ లేదా క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించడం ద్వారా మీరు బ్యాంక్ దృష్టిలో నమ్మకమైన కస్టమర్ అవుతారు -మీ క్రెడిట్ స్కోర్ కూడా మెరుగుపడుతుంది. ఒకవేళ పేమెంట్ డేట్ మర్చిపోతాము అని మీకు అనిపిస్తే మీరు మీ ఫోన్‌లో రిమైండర్‌ను సెట్ చేయవచ్చు.
అయినప్పటికీ క్రెడిట్‌ని అధికంగా ఉపయోగించడం అంటే మీరు మీ ఆదాయాలను నిర్వహించలేకపోతున్నారని గుర్తుంచుకోండి. అందుకే మీరు మళ్లీ మళ్లీ రుణాలు తీసుకుంటున్నారు.క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత, మీకు క్రెడిట్ లిమిట్ వస్తుంది. మీరు క్రెడిట్ లిమిట్ వరకు మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు. క్రెడిట్ వినియోగ నిష్పత్తి, అంటే ఖర్చు మొత్తం పరిమితిలో 30 శాతానికి మించకూడదు. ఉదాహరణకు, క్రెడిట్ లిమిట్ రూ. 2 లక్షలు అయితే, మీరు రూ. 60 వేల వరకు ఉపయోగించవచ్చు. అయితే, మీరు హాయిగా తిరిగి చెల్లించగలిగినంత మాత్రమే అప్పు తీసుకోవడం మంచిది. మొత్తం క్రెడిట్ కార్డ్ బకాయిలను చెల్లించండి. మొత్తం క్రెడిట్ లిమిట్‌ని ఉపయోగించకుండా జాగ్రత్త పడండి.
తక్కువ వ్యవధిలో చాలా సార్లు రుణం కోసం దరఖాస్తు చేయడాన్ని నివారించాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు..రెండు రకాల క్రెడిట్ ఎంక్వైరీస్ ఉంటాయి. సాఫ్ట్ -హార్డ్ ఎంక్వైరీ. మీ క్రెడిట్ స్కోర్‌ని మీరే చెక్ చేసుకున్నప్పుడు అది సాఫ్ట్ ఎంక్వైరీ అవుతుంది. క్రెడిట్ స్కోర్‌పై దాని ప్రభావం ఉండదు. అయితే బ్యాంకులు కోరినప్పుడు లోన్ కోసం అప్లై చేస్తున్నప్పుడు క్రెడిట్ బ్యూరోల నుంచి మీ క్రెడిట్ రిపోర్ట్ కోసం ఎంక్వైరీ చేస్తారు. దీనిని హార్డ్ ఎంక్వయిరీగా పరిగణిస్తారు. తక్కువ వ్యవధిలో పదేపదే రుణం కోసం దరఖాస్తు చేయడం మానుకోండి ఎందుకంటే ఇది కహార్డ్ ఎంక్వయిరీగా కౌంట్ అవుతుంది. ఇది లోన్ కోసం మీ తొందరను చూపిస్తుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది.
క్రెడిట్ హిస్టరీలోని అక్రమాల కారణంగా కొన్నిసార్లు క్రెడిట్ స్కోర్ చెడిపోవచ్చు. వీటిలో తప్పు ఖాతా వివరాలు, చెల్లించిన బకాయిలకు సంబంధించి సరైన సమాచారాన్ని అప్‌డేట్ చేయకపోవడం మొదలైన అంశాలు ఉండవచ్చు. ట్రాన్స్ యూనియన్ సిబిల్ ఎక్స్‌పీరియన్ వంటి క్రెడిట్ బ్యూరోలకు ఫిర్యాదు చేయడం ద్వారా మీరు వీటిని సరిదిద్దవచ్చు. తప్పులను సరిదిద్దడం వలన మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది.
మీ క్రెడిట్ స్కోర్ -నివేదికలను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం ముఖ్యం. ఈ దశలను అనుసరించడం ద్వారా సరిగ్గా లేని సిబిల్‌ను మెరుగు పర్చుకోవచ్చు. మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచవచ్చు. కొత్త లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్కోర్‌ను మెరుగుపరచడానికి ఎటువంటి నిర్ణీత సమయం లేదు. కాబట్టి మీరు మీ రెగ్యులర్ ప్రాక్టీస్‌లో ఈ పద్ధతులను చేర్చుకోవాలి. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే, మీరు తక్కువ వడ్డీ రేటుతో లోన్ పొందవచ్చు. లోన్ అందించేటప్పుడు, క్రెడిట్ స్కోర్ కాకుండా, బ్యాంకులు ఆదాయం, ఖర్చులు, వయస్సు, ఉద్యోగం, రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం వంటి ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. ఆపై మాత్రమే లోన్ అప్రూవ్ అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి