LPG Gas Price: ఎల్పీజీ గ్యాస్‌ బండ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? అసలు నిజం ఇదే..

|

Jul 08, 2022 | 12:58 PM

ప్రతి రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల ధరలు వేరు వేరుగా ఎందుకు ఉంటాయి? అసలు సిలిండర్ల ధరలను ఏ విధంగా నిర్ణయిస్తారు? మీకు ఎప్పుడైనా సందేహం కలిగిందా?..

LPG Gas Price: ఎల్పీజీ గ్యాస్‌ బండ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? అసలు నిజం ఇదే..
Lpg Price
Follow us on

All you wanted to know about LPG pricing formula: దేశ వ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల ధరలు గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణలో ఎల్పీజీ సిలిండర్‌ ఏకంగా రూ.1105కు చేరింది. జులై 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌ ధరను రూ.183.50 మేర తగ్గించినా.. కేవలం 5 రోజుల వ్యవధిలో డొమెస్టిక్ గ్యాస్‌ సిలిండర్ ధరలు చమురు సంస్థలు అమాంతంగా పెంచడంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజా పెంపుతో చాలా రాష్ట్రాల్లో రూ.1040, రూ.1053 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఎల్పీజీ సిలిండర్లపై పన్ను కారణంగానే రేట్లు అమాంతంగా పెరుగుతున్నాయని సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇది నిజమా? ప్రతి రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల ధరలు వేరు వేరుగా ఎందుకు ఉంటాయి? అసలు సిలిండర్ల ధరలను ఏ విధంగా నిర్ణయిస్తారు? మీకు ఎప్పుడైనా సందేహం కలిగిందా?

గ్యాస్‌ బండ ధరలు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఎందుకు ఉంటాయి?

ఎల్పీజీ సిలిండర్లపై విధించే పన్నులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వాలకు చేరుతుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. కానీ ఇది వాస్తవం కాదు. గ్యాస్ సిలిండర్ ధర జీఎస్టీ పరిధిలోకి వస్తుంది. దేశం మొత్తం మీద ఎల్పీజీ సిలిండర్లపై ఒకే పన్ను ఉంటుంది. పన్నుల ద్వారా వచ్చే సొమ్మును కేంద్రం, రాష్ట్రాలు సమానంగా పంచుకుంటాయి. పెట్రోల్‌ ధరలపై VAT విధించినట్లు, ఎల్పీజీ సిలిండర్ల ధరలో విధించరు. సిలిండర్లపై 5 శాతం జీఎస్టీ విధిస్తారు. దీనాలో 2.5 శాతం కేంద్రానికి, 2.5 శాతం రాష్ట్రాలకు వెళ్తుంది. మరి ధరల్లో మార్పులు ఎలా చోటుచేసుకుంటాయంటే.. ప్రతి రాష్ట్రంలోనూ కమిషన్‌, ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఛార్జీలు భిన్నంగా ఉంటాయి. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులపై ఇవి ఆధారపడి ఉంటాయి. అలాగే రవాణా ఛార్జీలు కూడా ఒక్కో రాష్ట్రానికి వేర్వేరు కారణాల రిత్యా మారుతూ ఉంటాయి. ఈ ఛార్జీలన్నీ ఒక్కో రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి. అందుకే దేశంలోని అన్ని చోట్లా సిలిండర్ ధరలు ఒకే విధంగా ఉండవు.

సిలిండర్ రేట్లు ఎలా నిర్ణయిస్తారు?

మన దేశంలో ఎల్పీజీ సిలిండర్ ధరను నిర్ణయించడంలో రెండు అంశాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ మొదటి కారణం, ఇంటర్నేషనల్‌ బెంచ్‌మార్క్ రేటు రెండోది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్‌పిజి ధర పెరిగి, రూపాయి బలహీనపడినప్పుడు దేశీయ మార్కెట్‌లో ఎల్‌పిజి ధర పెరుగుతుంది. ఐతే దురదృష్టవశాత్తు.. ప్రస్తుతం మన దేశంలో సిలిండర్ ధర పెరగడానికి ఆ రెండు కారకాలు ఏకకాలంలో కారణమయ్యాయి. అందుకే సామాన్యుడి నెత్తిమీద గుది బండలా గ్యాస్‌ బండ తాండవం చేస్తోంది.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి.