
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభ భయాలను రేకెత్తిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల ప్రభావం గ్యాస్, చమురు సరఫరాపై పడుతుందన్న వార్తలతో సామాన్యుల్లో ఆందోళన మొదలైంది. సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న అసత్య ప్రచారాల వల్ల అనేక రాష్ట్రాల్లో ప్రజలు పెట్రోల్ పంపుల వద్దకు పోటెత్తుతున్నారు. అయితే దేశంలో ఇంధన కొరత లేదని, కేవలం భయాందోళనతో అవసరానికి మించి కొనుగోలు చేయడం వల్లే బంకుల వద్ద నిల్వలు త్వరగా అయిపోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలామందికి ఉండే సందేహం.. ఒక పెట్రోల్ బంకులో ఎన్ని లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ నిల్వ ఉంటుంది? పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ ప్రమాణాల ప్రకారం.. సాధారణంగా భూగర్భ ట్యాంకుల సామర్థ్యం 15,000 నుండి 45,000 లీటర్ల వరకు ఉంటుంది. జాతీయ రహదారులు, మహానగరాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ పెద్ద ట్యాంకులు ఉంటాయి. చిన్న పట్టణాలు, గ్రామాల్లో తక్కువ సామర్థ్యం గల ట్యాంకులు ఉంటాయి. నిరంతరాయ సరఫరా కోసం ప్రతి బంకులో వారి సగటు అమ్మకాలకు కనీసం 3 రోజులకు సరిపడా నిల్వను ఎల్లప్పుడూ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వ రంగ చమురు కంపెనీలైన IOCL, BPCL వంటివి పెట్రోలియం నియమాలు 2002 ప్రకారం పనిచేస్తాయి. రిఫైనరీల నుండి బంకులకు ఇంధనాన్ని తరలించడానికి 12,000 నుండి 20,000 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్లను ఉపయోగిస్తారు. 25,000 లీటర్ల కంటే ఎక్కువ ఇంధనాన్ని నిల్వ చేయాలంటే ప్రభుత్వ ప్రత్యక్ష లైసెన్స్ తప్పనిసరి.
సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంధన సరఫరా గొలుసులో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజలు తమ అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, కాబట్టి సంయమనం పాటించాలని అధికారులు కోరుతున్నారు.