Public Provident Fund: పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సుస్థిరం చేయడం కోసం వారి చిన్నతనం నుంచే తల్లిదండ్రులు పొదుపు చేయడం ప్రారంభిస్తుంటారు. అయితే ఇందుకోసం ఎంచుకునే ఇన్వెస్ట్‌మెంట్ లో భాగంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతా ఒకటి. చాలా మంది తల్లిదండ్రులు ఖాతానైతే ప్రారంభిస్తున్నారు. కానీ కాలం గడిచే కొద్ది పెట్టుబడులు తగ్గిస్తున్నారు. కొన్ని సంవత్సరాలకు పూర్తిగా నిలిపేస్తున్నారు. పిల్లల కోసం పీపీఎఫ్ ఖాతాను ఓపెన్ చేయడం అనేది ఒక అద్భుతమైన ఆలోచన అనే చెప్పాలి. అయితే మీ పిల్లలకు పూర్తి ప్రయోజనాలు అందాలంటే.. పెట్టుబడులు స్థిరంగా ఉండేలా చూసుకోవడం, ఖాతాను దీర్ఘకాలం పాటు పూర్తిస్థాయిలో నిర్వహించడమూ ఎంతో ముఖ్యం.
ఉదాహరణకు.. మీ 10 సంవత్సరాల పాప కోసం పీపీఎఫ్ ఖాతాను ఓపెన్ చేశారనుకుందాం. రూ. 500 నెలవారీ కంట్రిబ్యూషన్‌తో ఖాతాను ప్రారంభించి, 15 సంవత్సరాల పాటు ఖాతాను కొనసాగిస్తే పాపకు 25 సంవత్సరాలు వచ్చేసరికి 7 శాతం వడ్డీ రేటు ప్రకారం దాదాపు ₹1,60,000 పొందవచ్చు. అప్పటికి పాప చదుపు పూర్తి చేసుకుని, ఉద్యోగంలో చేరి ఖాతాను మరో 35 సంవత్సరాలు కొనసాగిస్తే, అదే 7 శాతం వడ్డీ రేటు ప్రకారం రూ.27,86,658 ఆదాయాన్ని రాబట్టుకోవచ్చు. అయితే ఇక్కడ పెట్టుబడులు కొనసాగించిన మొత్తం కాలం 50 సంవత్సరాలు.
అలాగే ఇంకో ఉదాహరణగా చెప్పాలంటే మీ పాప 22 ఏళ్లకు చదుపు పూర్తి చేసుకుని, మొదటి ఉద్యోగంలో చేరింది అనుకుందాం. ఉద్యోగంలో చేరినప్పుడే అంటే తన 22 ఏళ్ల వయసులో 500 రూపాయలకు బదులుగా నెలకు రూ. 1,000 పీపీఎఫ్ ఖాతాలో పెట్టుబడి పెడితే, ఆమెకు 60 ఏళ్లు వచ్చేసరికి 7 శాతం వడ్డీ రేటు చొప్పున రూ. 23,72,635 మొత్తం పొందవచ్చు. ఇక్కడ పెట్టుబడులు కొనసాగించిన కాలం 38 సంవత్సరాలు.
అయితే మొదటి ఉదాహరణతో పోల్చినట్లయితే రెండో సందర్భంలో పెట్టుబడులు రెట్టింపయ్యాయి. అయినప్పటికీ, తక్కువ మొత్తాన్ని సమకూర్చుకోగలిగారు. ఇదే కాంపౌండ్ వడ్డీ ప్రభావం. అందుకే వీలైనంత తొందరగా పెట్టుబడులు ప్రారంభిచాలని చెబుతుంటారు ఆర్థిక నిపుణులు. మొదటి ఉదాహరణలో తక్కువ పెట్టుబడి పెట్టినప్పటికీ, పెట్టుబడులు పెట్టిన కాలం ఎక్కువ. అందువల్లే కాంపౌండ్ వడ్డీతో ఎక్కువ మొత్తం సమకూరింది.
? మైనర్ తరపున తల్లిదండ్రుల్లో ఒకరు మాత్రమే ఖాతా ఓపెన్ చేయవచ్చు. వారు భారతీయులై ఉండాలి.
? గార్డియన్ కేవైసి పూర్తి చేయాలి. దీంతోపాటు, మైనర్ ఫోటో, వయసును ధ్రువీకరణ పత్రం (ఆధార్ లేదా జనన నమోదు పత్రం), మొదటి కాంట్రీబ్యూషన్‌కు సంబంధించిన చెక్కు ఇవ్వాలి.
? మైనర్‌కు 18 సంవత్సరాలు వచ్చే వరకు తల్లిదండ్రులు ఖాతాను నిర్వహించవచ్చు.
? మైనర్ తల్లి లేదా తండ్రి లేదా చట్టపరమైన సంరక్షకుడు ఏడాదికి గరిష్ఠంగా రూ. 1.5 లక్షల వరకు పాప/బాబు తరపున అన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు.
? తల్లి లేదా తండ్రి పేరున కూడా పీపీఎఫ్ ఖాతా ఉంటే.. రెండు ఖాతాలలోనూ కలిపి గరిష్టంగా ఏడాదికి రూ.1.5 లక్షల వరకు మాత్రమే అన్వెస్ట్‌మెంట్ చేసే అవకాశం ఉంటుంది.