Home Loan: హోమ్ లోన్ తీసుకునే ముందు ఇవి పక్కా తెలుసుకోండి.. ఇలా చేస్తే మీకు మస్త్ పైసలు ఆదా..

ప్రతి మనిషి కల సొంతిల్లు. ఇది ఒక ఎమోషన్ మాత్రమే కాదు తెలివైన ఆర్థిక పెట్టుబడి కూడా. ఇప్పుడు హోమ్ లోన్స్ వల్ల చాలా మంది తమ కలను నిజం చేసుకుంటున్నారు. కేవలం లోన్ తీసుకోవడమే కాదు, దానివల్ల లభించే పన్ను మినహాయింపులు, ప్రభుత్వ నిబంధనల గురించి అవగాహన ఉంటేనే మీ ఇంటి కల భారం కాకుండా ఉంటుంది. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Home Loan: హోమ్ లోన్ తీసుకునే ముందు ఇవి పక్కా తెలుసుకోండి.. ఇలా చేస్తే మీకు మస్త్ పైసలు ఆదా..
Home Loan Tax Benefits 1

Updated on: Jan 24, 2026 | 2:17 PM

రోటీ, కప్దా ఔర్ మకాన్.. మనిషి బతకడానికి ప్రధానంగా కావలసినవి ఇవే.. ఇందులో ఇల్లు అత్యంత ముఖ్యమైనది. ఒకప్పుడు రిటైర్మెంట్ ఫండ్ వస్తే తప్ప ఇల్లు కట్టుకోలేకపోయేవారు. కానీ ఇప్పుడు హోమ్ లోన్స్ అందుబాటులోకి రావడంతో యువత త్వరగానే సొంత ఇంటి కలను నిజం చేసుకుంటున్నారు. అయితే ఇల్లు కట్టుకోవడం కోసం లోన్ తీసుకునే ముందు కొన్ని కీలకమైన అంశాలను, ముఖ్యంగా పన్ను ప్రయోజనాలనుఅర్థం చేసుకోవడం చాలా అవసరం. సిద్ధంగా ఉన్న ఇల్లు కొనడానికి లేదా ప్లాట్ కొని ఇల్లు నిర్మించుకోవడానికి బ్యాంకులు ఇచ్చే రుణాల్లో స్వల్ప తేడాలు ఉంటాయి. మీ సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేటప్పుడు, బ్యాంకులు మొత్తం నగదును ఒకేసారి ఇవ్వవు. నిర్మాణ పురోగతిని బట్టి మీ ఆర్కిటెక్ట్ లేదా ఇంజనీర్ ఇచ్చే సర్టిఫికేట్ ఆధారంగా విడతల వారీగా డబ్బును విడుదల చేస్తాయి. నిర్మాణం పూర్తయ్యే వరకు మీరు కట్టే వడ్డీని ప్రీ-EMI అంటారు. పూర్తి లోన్ విడుదలైన తర్వాతే అసలు EMI ప్రారంభమవుతుంది.

పన్ను మినహాయింపులు

హోమ్ లోన్ తీసుకోవడం వల్ల పన్ను ఆదా చేసుకునేందుకు అద్భుతమైన అవకాశం ఉంటుంది. సెక్షన్ 80C కింద ఏడాదికి రూ. 1.50 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. అయితే ఇది పాత పన్ను విధానంలో మాత్రమే వర్తిస్తుంది. ఇల్లు స్వాధీనం చేసుకున్న 5 ఏళ్లలోపు ఆస్తిని అమ్మితే క్లెయిమ్ చేసిన పన్ను ప్రయోజనాలు రద్దవుతాయి. సెక్షన్ 24(b) కింద సొంతంగా నివసించే ఇంటిపై చెల్లించే వడ్డీకి రూ.2 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. నిర్మాణం పూర్తి కావడానికి ముందు చెల్లించిన వడ్డీని , నిర్మాణం పూర్తయినప్పటి నుంచి 5 సమాన వాయిదాలలో క్లెయిమ్ చేసుకోవచ్చు.

కొత్త వర్సెస్ పాత పన్ను విధానం

పాత విధానం: ఇది హోమ్ లోన్ తీసుకునే వారికి చాలా లాభదాయకం. అసలు, వడ్డీ రెండింటిపై మినహాయింపులు పొందవచ్చు.

కొత్త విధానం: మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే సొంతంగా నివసించే ఇంటిపై వడ్డీ మినహాయింపు ఉండదు. అయితే అద్దెకు ఇచ్చిన ఆస్తిపై వచ్చే అద్దె ఆదాయం మేరకు వడ్డీని క్లెయిమ్ చేయవచ్చు.

కీలకమైన గడువు ..

రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటి నుండి 5 ఏళ్లలోపు ఇంటి నిర్మాణం పూర్తి కావాలి. ఒకవేళ ఆలస్యమైతే వడ్డీపై పొందే రూ.2 లక్షల మినహాయింపు కేవలం రూ.30,000 కు తగ్గిపోతుంది. కాబట్టి ఇంటి నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయడం ఆర్థికంగా ఎంతో ముఖ్యం. ఇంటి నిర్మాణం అనేది కేవలం ఒక ఆస్తిని సృష్టించుకోవడం మాత్రమే కాదు అది ఒక ఆర్థిక క్రమశిక్షణ. ప్రభుత్వం కల్పించే పన్ను ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుంటూ సరైన సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా మీ సొంత ఇంటి కల భారం కాకుండా చూసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి