ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఉంది.. ఆ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి ఉంది.. మార్కెటింగ్‌లో కంపెనీల పోటీపోటా పోటీ ఆఫర్లు ఉన్నాయి. అయితే హీరో కంపెనీ మరో అడుగు ముందుకేసింది. ఏకంగా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలను ప్రారంభించింది. ఇప్పటికే ఆదరణ ఉన్న డిజిటల్ సేల్స్ ను మరింత విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు హీరో వీడా వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలు ఏమిటి? పనితీరు ఎలా ఉంటుంది? ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి? స్కూటర్ ని ఎలా బుక్ చేసుకోవాలి వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మన దేశంలో ఈ హీరో విడా వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలు కేవలం బెంగళూరు, జైపూర్, ఢిల్లీ నగరాల్లోనే అందుబాటులో ఉన్నాయి. త్వరలో మహారాష్ట్రతో పాటు కొచ్చిన్, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్ వంటి నగరాల్లో విక్రయాలు ప్రారంభించనుంది. దీని ధర బెంగళూరులో రూ. 1.45 లక్షలు ఎక్స్ షోరూంగా ఉంది.
హీరో విడా వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. విడా వీ1 ప్లస్, విడా వీ1 ప్రో. రెండింటి మధ్య ప్రధాన తేడా ఏంటంటే బ్యాటరీ సామర్థ్యం, దాని రేంజ్, విడా వీ1 ప్లస్ స్కూటర్ 3.44kwh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఇది 143 కిలోమీటర్ల రేంజ్ ని ఇస్తుంది.0 నుంచి 40కిలోమీటర్ల వేగాన్ని ఇది 3.4 సెకండ్లలో అందుకుంటుంది. అలాగే విడా వీ1 ప్రో వేరియంట్ 3.94kwh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఇది 165 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 0 నుంచి 40కిలోమీటర్ల వేగాన్ని ఇది 3.2 సెకండ్లలో అందుకుంటుంది. రెండు వేరియంట్లలో గంటకు 80 కిలోమీటర్ల గరిష్టవేగంతో ప్రయాణించగలుగుతుంది.
రెండు వేరియంట్లలోనూ నాలుగు డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. ఎకో, రైడ్, స్పోర్ట్స్, కస్టమ్ యూజర్ మోడ్లు అందుబాటులో ఉంది. మార్చుకోదగిన బ్యాటరీలు ఈ స్కూటర్లలో ఉన్నాయి. హీరో కంపెనీ ముఖ్యంగా ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450 ఎక్స్, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి స్కూటర్లకు పోటీగా దీనిని రంగంలోకి దించింది. మూడు కలర్ ఆప్షన్లలో విడా వీ1 ప్రో స్కూటర్ అందుబాటులో ఉంది.అవి మ్యాటీ వైట్, మ్యాటీ స్పోర్ట్స్ రెడ్, గ్లాస్ బ్లాక్ వంటి కలర్స్. అలాగే ప్రో వెర్షన్ స్కూటర్ మ్యాటీ వైట్, మ్యాటీ స్పోర్ట్స్ రెడ్, గ్లాస్ బ్లాక్, మ్యాటీ అబ్రాక్స్ ఆరంజ్ వంటి కలర్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..