IRCTC: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. ఇకపై మీరు నిద్రపోయినా నో వర్రీ.. సరికొత్త ఫీచర్ ఇదిగో..
IRCTC Destination Alert: రాత్రి సమయంలో రైలు ఎక్కగానే నిద్రపోయే అలవాటు ఉందా? అయితే దిగవలసిన స్టేషన్ వచ్చేసరికి మెలకువ వస్తుందో రాదో అని ఆందోళనతో నిద్ర పోలేకపోతున్నారా? ఇక మీకు ఆ బాధ ఉండదు. ఐఆర్ సీటీసీ డెస్టినేషన్ అలర్ట్ అనే సదుపాయంతో.. వారే ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని నిద్రలేపుతారు.

మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రవాణా మార్గాల్లో భారతీయ రైల్వే ఒకటి. అతి తక్కువ ప్రయాణ చార్జీతో సౌకర్యవంతమైన, సురక్షిత ప్రయాణాన్ని రైలు ద్వారా మనం పొందగలం. ముఖ్యంగా రాత్రి ప్రయాణాల్లో బెర్త్ అవకాశం ఉంటుంది కాబట్టి పడుకొని మన గమ్యస్థానానికి చేరుకోవచ్చు. తెల్లవారే మన పనులు ఎంచక్కా చక్కబెట్టుకోవచ్చు. అయితే కొన్నిసందర్భాల్లో రైలులో ప్రయాణికులు నిద్రపోయి, మెలకువ లేక తాము దిగాల్సిన స్టేషన్ దాటిపోయి ఇబ్బందులు పడతారు. సాధారణంగా బస్సులో అయితే కండక్టరో, డ్రైవరో వచ్చి లేపుతారు. రైలులో ఆ అవకాశం ఉండదు కాబట్టి ట్రైన్ ముందుకు వెళ్లిపోతుంది. అలాంటి పరిస్థితిని అధిగమించేందుకు రైల్వే శాఖ మంచి ప్రత్యామ్నాయాన్ని అందించింది. అదే ‘డెస్టినేషన్ అలర్ట్’. ప్రయాణికుల సౌకర్యార్థం ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చిన డెస్టినేషన్ అలర్ట్ ద్వారా మీరు నిద్రపోయినా ఎంచక్కా ఫోన్ కాల్ ద్వారా ఐవీఆర్ మిమ్మల్ని నిద్ర లేపి అలర్ట్ చేస్తుంది. ఈ సదుపాయాన్ని ఎలా వినియోగించుకోవాలి? రిజిస్ట్రేషన్ ఎలా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రాత్రి ప్రయాణాలకు మాత్రమే..
ఐఆర్సీటీసీ డెస్టినేషన్ అలర్ట్ రాత్రి 10 గం. నుంచి ఉదయం 7గం. వరకు అందుబాటులో ఉంటుంది. ఆ సమయంలో రైల్వే ప్రయాణం చేసేవారు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రయాణికుడు నిద్రలోకి జారుకున్నా.. దిగాల్సిన స్టేషన్ వచ్చేందుకు 20 నిమిషాల ముందు గానే ప్రయాణికులకు ఎస్ఎంఎస్‌తో పాటు ఫోన్ కాల్ ద్వారా అలర్ట్ అందుతుంది. తద్వరా నిద్ర మేల్కొని, కంగారు లేకుండా దిగాల్సిన స్టేషన్లో దిగవచ్చు.
అలర్ట్ కోసం ఇలా చేయాలి..
- రైల్వే ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ నుంచి 139కి డయల్ చేయాలి.
- తెలుగు, హిందీ, ఇంగ్లిష్.. వీటిల్లో మీ భాషను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత ఐవీఆర్ మెనూలో ఆప్షన్ 7 ఎంచుకోవాలి.
- అనంతరం 2 నంబర్‌పై ప్రెస్ చేసి మీ 10 అంకెల పీఎన్ఆర్ నంబర్ ఎంటర్ చేయాలి.
- చివరలో కన్ఫర్మ్ కోసం 1 నంబర్ ప్రెస్ చేయాలి.
- కన్ఫర్మ్ అయిన తర్వాత మీ నంబర్ కి ఓ ధ్రువీకరణ మెసేజ్ కూడా వస్తుంది.
ఎస్ఎంఎస్ ద్వారా.. ప్రయాణికులు తమ ఫోన్‌లో ఎస్ఎంఎస్ ద్వారా కూడా డెస్టినేషన్ అలర్ట్ పొందవచ్చు. ఇందుకోసం తమ మొబైల్ నుంచి 139 నంబర్‌కు ‘Alert’ అని టైప్ చేసి పంపించాలి. అంతే.. డెస్టినేషన్ అలర్ట్ యాక్టివేట్ అవుతుంది. అయితే ఈ సర్వీస్ ఉచితం కాదు. ప్రతి అలర్ట్ కి రూ.3 వసూలు చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..