దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. గత కొన్ని నెలలుగా దాని నుంచి బయట పడేందుకు పోరాడుతోంది. ఇస్లామాబాద్ ఐఎంఎఫ్ తో బెయిలవుట్ ఒప్పందాన్ని పొందినా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా మందగమనంలోనే ఉంది. వాస్తవానికి మన భారతదేశంలో ఏ విషయంలోనూ పోరాడే స్థితిలో ప్రస్తుత పాకిస్తాన్ లేదనే చెప్పాలి. గత 70ఏళ్లల్లో మనం అభివృద్ధి సాధించినట్లు పాకిస్తాన్ చేయలేకపోయింది. దానికి ఆ ప్రభుత్వాలలోని సంస్థాగత లోపాలతో పాటు చాలా కారణాలు ఉన్నాయి. తప్పుడు విధాన నిర్ణయాలు, రాజకీయ కారణాలు వంటివి దాని అభివృద్ధి కంటకాలుగా మారాయి. అయితే పాకిస్తాన్ లో కూడా కొందరు పారిశ్రామిక వేత్తలు ఆ దేశ పేరును ప్రపంచ వ్యాప్తంగా వినిపింపజేయడంలో కృషి చేశారు. వ్యాపార ప్రపంచంలో తమ దేశానికి గౌరవ ప్రదమైన స్థానాన్ని తీసుకొచ్చారు. వారిలో టాప్ బిలియనీర్ షాహిద్ ఖాన్. ఈయన పాకిస్తాన్ లోనే అత్యంత సంపన్నుడు. ఈయన గురించిన వివరాలు చూద్దాం..
వాస్తవానికి బిలియనీర్ వ్యాపారవేత్తల సంఖ్య, వారు చేస్తున్న వ్యాపారాలు, వారికున్న ఆస్తుల్లో కూడా మన దేశంతో పోల్చితే పాకిస్తాన్ ఎక్కడా నిలబడ లేదు. ఉదాహరణకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన భారతదేశపు అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ నికర ఆస్తి విలువ సుమారు 90 బిలియన్ డాలర్లు కాగా, మరో బిలియనీర్ గౌతమ్ అదానీ నికర ఆస్తి విలువ 54బిలియన్ డాలర్లుగా ఉంది. అదే సమయంలో పాకిస్తాన్ లో అత్యంత సంపన్నుడైన షాహిద్ ఖాన్ నికర ఆస్తి విలువ కేవలం 12 బిలియన్ డాలర్లు మాత్రమే కావడం గమనార్హం. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో.
జూలై 18, 1950న జన్మించిన షాహిద్ ఖాన్ ఫ్లెక్స్-ఎన్-గేట్ యజమాని. ఒక బిలియనీర్. స్పోర్ట్స్ టైకూన్ అని పిలుస్తారు. నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్)లో జాక్సన్‌విల్లే జాగ్వార్స్, ప్రీమియర్ లీగ్ ఫుల్‌హామ్ ఎఫ్సీ ఫ్రాంచైజీలకు యజమాని. ఫ్లెక్స్-ఎన్-గేట్ మోటారు వాహన భాగాలను సరఫరా చేస్తుంది. షాహిద్ ఖాన్ తన కుమారుడు టోనీ ఖాన్‌తో పాటు అమెరికన్ రెజ్లింగ్ ప్రమోషన్ ఆల్ ఎలైట్ రెజ్లింగ్ (ఏఈడబ్ల్యూ)కి కూడా సహ యజమాని. ఈ షాహిద్ ఖాన్ పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జన్మించాడు. అతను మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. షాహిద్ ఖాన్ యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్‌లో చదువుకున్నాడు. షాహిద్ ఖాన్ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను యుఎస్‌లో చదువుతున్నప్పుడు డిష్‌వాషర్‌గా పనిచేశానని చెప్పాడు. ఈ షాహిద్ ఖాన్ 16 సంవత్సరాల వయస్సులో అమెరికా వెళ్ళాడు. 1971లో గ్రేంగర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్(బీఎస్సీ)లో పట్టభద్రుడయ్యాడు. 1999లో, మెకానికల్ సైన్స్, ఇంజినీరింగ్ విశిష్ట పూర్వ విద్యార్థుల పురస్కారం లభించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..