
కరోనా అనంతర పరిణామాల్లో హెల్త్ ఇన్సురెన్స్ అవసరాన్ని ప్రజలు గుర్తించారు. అందుకే అందరూ ఏదో ఒక హెల్త్ ఇన్సురెన్స్ ను కలిగి ఉంటున్నారు. సాధారణ ప్రజలకు అనేక రకాల ప్రయోజనాలతో ప్లాన్లు ఆయా కంపెనీలు అందిస్తున్నాయి. అయితే దివ్యాంగులకు పెద్దగా ప్లాన్లు అందుబాటులో ఉండవు. ఒకవేళ ఉన్నా అధిక రేట్లను కలిగి ఉంటాయి. మరి అలాంటి వారు ఏం చేయాలి? అందుకే ప్రభుత్వమే ఓ మంచి ఆరోగ్య బీమా పథకాన్ని దివ్యాంగుల కోసం తీసుకొచ్చింది. దాని పేరు నిరామయ ఆరోగ్య బీమా పథకం. ఇది సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కింద ఒక చట్టబద్ధమైన సంస్థ అయిన నేషనల్ ట్రస్ట్ ద్వారా అమలవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
జాతీయ ట్రస్ట్ చట్టం, 1999 కింద కవర్ అవుతున్న దివ్యాంగులకు సరసమైన ఆరోగ్య బీమాను అందించడం నిరామయ పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం రీయింబర్స్‌మెంట్ ప్రాతిపదికన సంవత్సరానికి రూ. 1 లక్ష వరకు ఆరోగ్య బీమా రక్షణను అందిస్తుంది.
ఆరోగ్య బీమా కవరేజీ: వివిధ హాస్పటల్ ఖర్చుల కోసం రూ. 1,00,000/- వరకు కవరేజ్ లభిస్తుంది.
ఔట్ పేషెంట్ విభాగం (OPD) చికిత్స: ఔషధాలు, పాథాలజీ, రోగనిర్ధారణ పరీక్షలు మొదలైనవాటిని కవర్ చేస్తుంది.
రెగ్యులర్ మెడికల్ చెకప్‌లు: వైకల్యాలున్న అనారోగ్యం లేని వ్యక్తుల కోసం రెగ్యూల్ మెడికల్ చెకప్స్ ఉంటాయి.
దంత సంరక్షణ: ప్రివెంటివ్ డెంటిస్ట్రీ సేవలు పొందొచ్చు.
శస్త్రచికిత్స: వైకల్యం మరింత తీవ్రతరం కాకుండా నిరోధించడానికి లేదా ఇప్పటికే ఉన్న వైకల్యాలకు (పుట్టుకతో సహా) ఆపరేషన్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.
నాన్-సర్జికల్/హాస్పిటలైజేషన్: నాన్-సర్జికల్ చికిత్సలు, సంబంధిత హాస్పిటల్ చార్జీలు కవర్ అవుతాయి.
కొనసాగుతున్న చికిత్సలు: వైకల్యం, సంబంధిత సమస్యల నిర్వహణ కోసం కవరేజ్ ఉంటుంది.
ప్రత్యామ్నాయ ఔషధం: ప్రత్యామ్నాయ చికిత్స ఎంపికల కోసం కవరేజ్ ఉంటుంది.
రవాణా ఖర్చులు: వైద్య సంరక్షణకు సంబంధించిన రవాణా కోసం రీయింబర్స్‌మెంట్ అవకాశం ఉంటుంది.
నేషనల్ ట్రస్ట్ యాక్ట్, 1999 ప్రకారం చెల్లుబాటు అయ్యే వైకల్య ధ్రువీకరణ పత్రాలతో కనీసం ఒక వైకల్యం ఉన్న ఎవరైనా దివ్యాంగులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆటిజం, సెరిబ్రల్ పాల్స్, మానసిక రుగ్మతలు, దివ్యాంగులు ఎవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
దివ్యాంగుల తల్లిదండ్రులు/సంరక్షకులు అవసరమైన పత్రాలతో నిరామయ నమోదు కోసం సమీపంలోని రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్ఓ)ని సందర్శించాలి. ఆర్ఓ నిరామయ దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో నింపి, అసలైన వాటి ధ్రువీకరణ తర్వాత అవసరమైన విధంగా స్కాన్ చేసిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. నమోదు విజయవంతం అయిన తర్వాత, ప్రతి లబ్ధిదారునికి హెల్త్ ఐడీ నంబర్ /కార్డ్ జారీ అవుతుంది. లేదా లబ్ధిదారు ఆన్‌లైన్ లేదా ఆర్ఓ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జిల్లా ఆసుపత్రి లేదా తగిన ప్రభుత్వ అధికారి నుంచి జారీ చేసిన వైకల్య ధ్రవీకరణ పత్రం. పేదరిక స్థాయికి దిగువన లేదా బీపీఎల్ కార్డ్ (లబ్దిదారుడు బీపీఎల్ వర్గానికి చెందినవారైతే), చిరునామా రుజువు, లబ్దిదారుడు ఏపీఎల్ వర్గానికి చెందినట్లయితే ఆదాయ ధ్రువీకరణ పత్రం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..