Deepseek AI: డీప్ సీక్ ఏఐపై హ్యాకర్ల కన్ను.. దుర్వినియోగం చేసే అవకాశం
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) రంగంలో చైనా తయారు చేసిన డీప్ సీక్ ఏఐ కొత్త రికార్డులు నెలకొల్పింది. తక్కువ ఖర్చుతో అత్యంత మెరుగైన ఏఐ చాట్ బాట్ ను తయారు చేసింది. అలాగే యూజర్లకు ఉచితంగా ఆ సేవను అందించింది.. దీంతో ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న అమెరికాను కలవర పెట్టింది. ఎందుకంటే డీప్ సీక్ ఏఐ బయటకు రాగానే అమెరికాకు చెందిన టాప్ టెక్ కంపెనీల షేర్లు పతనమయ్యాయి.

ఇప్పటికే చైనా ఏఐపై అనేక విమర్శలు వచ్చాయి. దాని వల్ల దేశ భద్రతకు ప్రమాదం కలుగుతుందంటూ పలు దేశాలు నిషేధం విధించాయి. ఇప్పడు మరో కొత్త విషయం ప్రపంచాన్ని షాక్ కు గురి చేస్తోంది. డీప్ సీక్ ఏఐని వాడుకుని హ్యాకర్లు అనేక దారుణాలకు పాల్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. తాజా చెక్ పాయింట్ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించారు. డీప్ సీక్ తన కొత్త ఆర్ఐ ఏఐ మోడల్ ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది. దీన్ని అనేక మంది యూజర్లు ఇన్ స్టాల్ చేసుకున్నారు. డీప్ సీక్ ఏఐ సేవలను ప్రశంసించారు. ఇదే సమయంలో హ్యాకర్ల కన్ను డీప్ సీక్ ఏఐపై పడింది. వారు దాని సేవలను పూర్తిగా దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే హ్యాకర్ కమ్యూనిటీ ప్రస్తుతం డీప్ సీక్, క్వెన్ ద్వారా హానికరమైన కంటెంట్ ను డెవలప్ చేయడానికి ఏఐ సాధనాలను ఉపయోగిస్తున్నారు.
ఏఐ టెక్నాలజీ కారణంగా అన్ని రంగాలలో పనులు మరింత సులభమయ్యాయి. ఏ సమస్యకైనా చిటికెలో పరిష్కారం చూపుతున్నాయి. దీనితో అనేక కంపెనీలు ఏఐ సేవలపై ఆధారపడుతున్నాయి. మనుషులకంటే వేగంగా, తప్పులు లేకుండా సమస్యలను పరిష్కరించడం దీని ప్రత్యేకత. అయితే కొత్త ఏఐ మోడళ్లపై అప్రమత్తంగా ఉండాలని భద్రతా నిపుణులు చెబుతున్నారు. చెక్ పాయింట్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ విడుదల చేసే వార్షిక నివేదికను చెక్ పాయింట్ నివేదిక అంటారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అనేక విషయాలను దీనిలో ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ దాడులలో 44 శాతం పెరుగుదల నమోదైందని తాజా నివేదికలో తెలిసింది.
డీప్ సీక్ మార్కెట్ లోకి రావడంతోనే సంచలనం రేపింది. వస్తూనే అమెరికా స్టాక్ మార్కెట్ ను గడగడలాడించింది. దీంతో యూఎస్ టెక్ స్టాక్ లను భారీగా అమ్ముకోవాల్సి వచ్చింది. డీప్ సీక్ దెబ్బకు ఎన్విడియా, ఓరాకిల్ తో సహా అనేక మంది బిలియనీర్లు భారీ నష్టాల భారిన పడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే చైనా కు చెందిన డీప్ సీక్ ఏఐని చూసి అమెరికా కూడా భయపడింది. చైనాకు చెందిన లియాంగ్ వెన్ ఫెంగ్ అనే వ్యాపారవేత్త ఏఐ కంపెనీ డీప్ సీక్ ఏర్పాటు చేశారు. అమెరికాకు ధీటుగా చైనాను నిలిపేందుకే కొత్త చాట్ బాట్ రూపొందించినట్టు చెప్పాడు. డీప్ సీక్ ఉత్పాదక ఏఐ మోడల్ రిలీజ్ వల్ల అమెరికాలోని టెక్ స్టాక్ లలో భారీ అమ్మకాలు జరిగాయి. ప్రముఖ చిప్ కంపెనీ అయిన ఎన్విడియా దాదాపు 600 బిలియన్లు నష్టపోయింది. ఓరాకిల్ చైరమ్ లారీ ఎల్లిసన్ కు 27.6 డాలర్లు, ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ కు 20.8 బిలియన్ డాలర్ల నష్టం కలిగింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి