
దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. పండుగ లేదా శుభాకార్యం వచ్చిందంటే చాలూ మహిళలకు బంగారం ఉండాల్సిందే. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే కేంద్రం జీఎస్టీలో కీలక సంస్కరణలు చేపట్టింది. ఎన్నో వస్తువులపై జీఎస్టీని తగ్గించింది. ఈ క్రమంలో బంగారంపై జీఎస్టీ తగ్గిందా..? పెరిగిందా..? అనేదానిపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అయితే బంగారంపై పన్నులలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. చాలా వస్తువులపై జీఎస్‌టీ రేట్లు మారినా, బంగారం, వెండిపై పన్ను రేటు మాత్రం స్థిరంగా ఉంది.
బంగారం బార్లు, నాణేలు, ఆభరణాలపై 3 శాతం జీఎస్టీ కొనసాగుతుంది. అయితే నగల తయారీ ఖర్చుపై 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఉదాహరణకు మీరు రూ.1,00,000 విలువైన బంగారు బారు లేదా నాణెం కొనుగోలు చేస్తే.. దానిపై 3 శాతం అంటే రూ.3,000 జీఎస్టీ పడుతుంది. మొత్తం ఖర్చు రూ.1,03,000 అవుతుంది.
ఒకవేళ మీరు రూ.1,00,000 విలువైన బంగారు ఆభరణాలు కొంటే.. బంగారం విలువపై 3 శాతం జీఎస్టీ (రూ.3,000) పడుతుంది. దీనికి అదనంగా తయారీ ఖర్చు ఉంటుంది. ఉదాహరణకు తయారీ ఖర్చు రూ.10,000 అయితే, దానిపై 5 శాతం జీఎస్టీ (రూ.500) పడుతుంది. ఈ మొత్తం ట్యాక్స్ రూ.3,500 అవుతుంది.
బంగారం కొనుగోలు చేసేటప్పుడు మీరు చెల్లించే బిల్లులో ఈ కింది ఛార్జీలు ఉంటాయి:
బంగారం విలువ: కొనుగోలు చేసే రోజున బంగారం బరువు, స్వచ్ఛత (క్యారెట్) ఆధారంగా దాని విలువ లెక్కిస్తారు.
తయారీ ఖర్చులు: ఆభరణాలు రూపొందించడానికి అయ్యే ఖర్చు ఇది. ఇది బంగారం విలువపై 8శాతం నుంచి 25% వరకు ఉండొచ్చు.
వేస్టేజీ ఛార్జీలు: నగలు తయారు చేసేటప్పుడు కొంత బంగారం వృథా అవుతుంది. దీనికి వేస్టేజీ ఛార్జీలు లెక్కిస్తారు. ఇది బంగారం బరువుపై ఆధారపడి ఉంటుంద. కొన్ని షాపులు వేస్టేజీ, తయారీ ఖర్చులను కలిపి “వాల్యూ అడిషన్” అని కూడా పిలుస్తాయి.
జీఎస్టీ: బంగారం విలువ, తయారీ ఖర్చులు, వేస్టేజీ మీద 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో కేవలం బంగారం విలువపై 3శాతం జీఎస్టీ, తయారీ ఖర్చులపై 5శాతం జీఎస్టీ విడివిడిగా లెక్కిస్తారు.
జీఎస్టీలో మార్పులు వచ్చినా, బంగారంపై 3 శాతం జీఎస్టీ, తయారీ ఖర్చులపై 5 శాతం జీఎస్టీ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ స్పష్టతతో బులియన్, నగల వ్యాపారులకు పండుగ సీజన్లలో వ్యాపారం చేయడానికి మరింత సౌలభ్యం ఏర్పడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..