GST: మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ వస్తువులపై భారీగా జీఎస్టీ తగ్గింపు.. లిస్టులో ఏం ఉన్నాయంటే..?

జీఎస్టీ తగ్గింపుపై ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు జీఎస్టీలో కీలక మార్పులు చేస్తామని ప్రధాని మోదీ చెప్పడంతో అసలు వేటిపై తగ్గిస్తారనే చర్చలు జోరందుకున్నాయి. సామాన్యాలకు ఊరట ఇచ్చేలా కొన్ని కీలక వస్తువుల ధరలు తగ్గనున్నాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

GST: మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ వస్తువులపై భారీగా జీఎస్టీ తగ్గింపు.. లిస్టులో ఏం ఉన్నాయంటే..?
GST Council Meeting:

Updated on: Aug 26, 2025 | 8:14 AM

ఈ సారి ప్రజలు డబుల్ దీపావళి జరుపుకుంటారని స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని మోదీ అన్నారు. జీఎస్టీ విధానంలో కీలక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో వివిధ వస్తువులు, సేవలపై పన్ను రేట్లను తగ్గించడంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు ప్రజలకు భారీ ఊరటనిచ్చే అవకాశం ఉంది.

పన్ను రేట్లలో భారీ మార్పులు?

సిమెంట్‌పై జీఎస్టీ తగ్గింపు: సిమెంట్‌పై ప్రస్తుతం ఉన్న 28శాతం జీఎస్టీ రేటును 18శాతానికి తగ్గించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఈ తగ్గింపు నిర్మాణ రంగానికి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఊతమిస్తుంది. వినియోగదారులకు కూడా ఇళ్ల నిర్మాణం మరింత చౌకగా మారే అవకాశం ఉంది.

వ్యక్తిగత బీమాపై జీరో: వ్యక్తులు కొనుగోలు చేసే టర్మ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీని సున్నాకి తగ్గించే ప్రతిపాదన కూడా కౌన్సిల్ ముందుకు రానుంది. ఈ చర్య ఆరోగ్య బీమాను ప్రోత్సహించి, దేశంలో బీమా పరిధిని పెంచేందుకు తోడ్పడుతుంది.

సెలూన్ సర్వీసులపై : ప్రస్తుతం మధ్యస్థం నుండి హై-ఎండ్ సెలూన్‌లపై విధించే 18శాతం జీఎస్టీని 5శాతానికి తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఈ మార్పు సాధారణ ప్రజలకు సెలూన్ సర్వీసులను మరింత అందుబాటులోకి తీసుకొస్తుంది.

ఆహార – వస్త్రాలపై ఒకే శ్లాబు: ఆహార, వస్త్ర వస్తువులన్నింటినీ 5శాం పన్ను శ్లాబ్‌లోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇది ఆహార, వస్త్ర పరిశ్రమలలో వర్గీకరణ సమస్యలను తొలగించి, పన్ను విధానాన్ని మరింత సులభతరం చేస్తుంది.

జీఎస్టీ వ్యవస్థ పునర్నిర్మాణం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జీఎస్టీ వ్యవస్థను పూర్తిగా పునఃపరిశీలించే అవకాశం ఉంది. వివిధ పన్ను శ్లాబ్‌లను కేవలం రెండు ప్రధాన శ్లాబ్‌లుగా ఏకీకృతం చేయాలని కౌన్సిల్ భావిస్తోంది. కొన్ని విలాసవంతమైన వస్తువులపై 40శాతం పన్ను కొనసాగించవచ్చు.

ఈ ప్రతిపాదనలు జీఎస్టీ వ్యవస్థను సరళీకృతం చేసి, పన్ను విధానంపై ఉన్న గందరగోళాన్ని తగ్గించడానికి ఉపయోగపడనున్నాయి. అయితే పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాలు 40శాం పన్ను పరిమితిని మరింత పెంచాలని కోరాయి. కానీ అధికారులు ఇది చట్టపరమైన సవరణలను కోరుతుందని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. 8ఏళ్ల క్రితం జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పన్ను వ్యవస్థను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, వినియోగదారులకు, ప్రభుత్వానికి ప్రయోజనం కలిగేలా సమతుల్యం చేయడానికి ఈ సమావేశం ఒక ముఖ్యమైన వేదిక కానుంది. ఈ నిర్ణయాలన్నీ అమలైతే, ప్రజలకు ధరల భారం తగ్గే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..