Gas Cylinder Prices: ఇప్పటికే పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుండటం సామాన్యులకు భారంగా మారుతుంటే మరో వైపు గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతుండటం మరింత భారంగా మారుతోంది. ఆగస్టు, సెప్టెంబర్‌లో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. మళ్లీ భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. వెలువడుతున్న నివేదికల ప్రకారం.. అక్టోబర్ నెలలో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగానే పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
గ్యాస్ ధరలు ఏకంగా 57 – 70 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో గ్యాస్ సిలిండర్ కొనాలంటే సామాన్యుడికి భారంగా మారే అవకాశం ఉంది. అయితే ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటాయి గ్యాస్ కంపెనీలు. దీని వల్ల ఆటో ఫ్యూయెల్, పైప్డ్ నేచురల్ గ్యాస్ ధరలు పెరగనున్నాయి.
కొత్త డొమెస్టిక్ గ్యాస్ పాలసీ 2014లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేచురల్ గ్యాస్ ధరలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షిస్తూ వస్తుంది. విదేశీ మార్కెట్‌లోని ధరల ప్రాతిపదికన మన దేశంలో ధరలు నిర్ణయిస్తారు. దీంతో అక్టోబర్ 1న ధరలు భారీగా పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఏపీఎం గ్యాస్ ధర ఎంఎంబీటీయూకు 1.79 డాలర్‌గా ఉంది. ఇది 3 డాలర్ల పైకి చేరవచ్చనే అంచనాలున్నాయి. ఎంఎంబీటీయూకు 1 డాలర్ పెరిగినా కూడా కంపెనీలకు 25 నుంచి 30 శాతం ప్రాఫిట్ పెరుగుతుంది. దీంతో సామాన్యులపై మరింత భారం కానుంది. ఇకపోతే విదేశీ మార్కెట్‌లో నేచురల్ గ్యాస్ ధర బుధవారం ఒక్క రోజే 8 శాతం మేర పెరిగింది. ఇప్పటికే రూ.1000 చేరువలో ఉన్న గ్యాస్ సిలిండర్ ధర.. మరింతగా పెరిగినట్లయితే సామాన్య ప్రజలకు మరింత భారం కానుంది. ఇలా అన్నింటి ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడు జీవించడం కష్టతరంగా మారుతోంది.
ఢిల్లీ – రూ.884.50
కోల్‌కతా – రూ. 911
ముంబై – 884.50
చెన్నై – రూ.900.50
హైదరాబాద్ – రూ. 937
బెంగళూరు – రూ.887.50