Google Pay FD: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలంటే బ్యాంకులో ఖాతా తీసుకోవడం తప్పనిసరి. తర్వాత ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే బ్యాంక్ ఖాతా తెరవకుండానే ఫిక్స్‌డ్ డిపాజిట్స్ చేసే సదుపాయం ఉంది.ఈ విధమైన సేవలను పరిశ్రమలో తొలిసారిగా తాము ఆఫర్ చేస్తున్నట్టు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (SFB) ప్రకటించింది. ఒక ఏడాదిపాటు చేసే ఎఫ్‌డీలపై 6.35 శాతం వరకు వడ్డీ ఉంటుందని పేర్కొంది. రూ.5 లక్షల వరకు డిపాజిట్ గ్యారంటీ ఉంటుందని వివరించింది. ఎలాంటి బ్యాంకు ఖాతా లేకుండా గూగుల్ పేలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే ప్రక్రియ రెండు నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు.
వినియోగదారులు గూగుల్ పే యాప్‌లో బిజినెస్ అండ్ బిల్స్ విభాగంలో ఈక్విటాస్ బ్యాంకును ఎంచుకోవాలి. డిపాజిట్ చేయాలనుకున్నవారు మొత్తం, కాల పరిమితి నిర్దేశిస్తూ వ్యక్తిగత కేవైసీ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. కాలపరిమితి ముగియక ముందే ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను రద్దు చేసుకుంటే అదే రోజు వినియోగదారుకు చెందిన బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అవుతుందని ఈక్విటాస్ తెలిపింది.
ముందుగా గూగుల్ పే యాప్‌ను ఓపెన్ చేసి బిజినెస్ అండ్ బిల్స్ కేటగిరిలోకి వెళ్లాలి. అందులో ఈక్విటాస్ (SFB) లోగోపై క్లిక్ చేయాలి. ఈక్విటాస్ బ్యాంకు స్పాట్ ద్వారా ఎఫ్‌డీ కోసం మొత్తం కాల వ్యవధిని ఎంచుకోవాలి. మీ వ్యక్తిగత, కేవైసీ వివరాలు (ఆధార్, పాన్ నెంబర్లు) నమోదు చేయాల్సి ఉంటుంది. గూగుల్ పే యూపీఐని ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు.
కాగా, వివిధ బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక చిన్న చిన్న బ్యాంకులు కూడా ఎఫ్‌డీలపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ డిపాజిట్ల విషయాలలో బ్యాంకులు అప్పుడప్పుడు వడ్డీ రేట్లను మార్పుస్తూ ఉంటాయి.