
ఈపీఎఫ్ చందాదారులకు ఇది నిజంగా శుభవార్తే. గతంలో డబ్బులు తీసుకోవాలంటే ఎక్కువ సమయం పట్టేది. దరఖాస్తు చేసుకోవడం, దాన్ని ఈపీఎఫ్ వో ఆమోదించడం, అనంతరం అతడి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమయ్యేవి. కారణం సరిగ్గా లేకపోతే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యేది. ఇన్ని ఇబ్బందులు పడలేక చాలా మంది చందాదారులు బయట అప్పులు చేసేవారు. కొత్త విధానంతో అలాంటి సమస్యలు ఉండవు, సమయానికి డబ్బు చేతికి వస్తుంది. ఏటీెెఎంతో పాటు ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్ ల ద్వారా ఈపీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.
ఈపీఎఫ్ ఖాతాలను నిర్వహించే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ వో) ఈ మేరకు చర్యలు తీసుకుంటోంది. చందాదారుల సౌకర్యం కోసం యూపీఐ ఆధారిత క్లెయిమ్ ప్రాసెసింగ్ అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఖాతాదారులకు తక్కువ సమయంలో డబ్బులు అందజేయడం, లావాదేవీల సమయాన్ని గణనీయంగా తగ్గించడం దీనికి గల ప్రధాన కారణాలు. బహుశా ఈ ఏడాది జూన్ నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈపీఎఫ్ చందాదారులు అత్యవసర ఖర్చుతో పాటు ఇంటి నిర్మాణం, విద్య, వివాహం కోసం తమ ఖాతాలో డబ్బులను తీసుకోవచ్చు.
కార్మిక, ఉపాధి కార్యదర్శి సుమితా దావ్రా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈపీఎఫ్ కొత్త విధానాన్ని ధ్రువీకరించారు. ఈ ఏడాది మే నెల చివరకు, లేదా జూన్ నెలలో అమల్లోకి వస్తుందన్నారు. అవసరమైన అన్ని పరీక్షలు చేసిన అనంతరం, ఈపీఎఫ్ క్లెయిమ్ ల కోసం యూపీఐ ఫ్రంట్ ఎండ్ ను విడుదల చేస్తామని తెలిపారు. దీనివల్ల చందాదారులందరికీ ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. వారందరూ తమ ఖాతాలను యూపీఐ ఇంటర్ ఫేస్ లో చూసే వీలుంటుందని, ఆటో క్లెయిమ్ లను చేసుకోగలరన్నారు. తద్వారా అర్హులందరికీ వెంటనే ఆమోదం జరిగి, వారి ఖాతాలకు డబ్బులు జమవుతాయన్నారు. ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా సభ్యులు తక్షణమే ఒక లక్ష రూపాయల వరకూ విత్ డ్రా చేసుకోగలరన్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్ సభ్యులకు క్లెయిమ్ ప్రక్రియ రెండు నుంచి మూడు రోజులు పడుతుందని, యూపీఐ ఇంటిగ్రేషన్ తర్వాత విత్ డ్రాలు కేవలం గంటలు, నిమిషాల్లోనూ పూర్తవుతాయన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి