భారతదేశంలో బ్యాంకింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. ప్రజలు బ్యాంకుల్లోనే తమ సొమ్మును భద్రం చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న జనాభాతో పాటు బ్యాంకు ఖాతాలు కూడా పెరగడంతో బ్యాంకు ఉద్యోగులపై పని భారం పెరగుతుంది. అలాగే బ్యాంకు టైమింగ్స్ వల్ల కొంత మంది సాధారణ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు బ్యాంకు సేవలను పొందాలంటే కచ్చితంగా సెలవు పెట్టాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో సాధారణ రోజుల్లో బ్యాంకుల్లో పని చేసే సమయాన్ని పెంచి వారానికి ఐదు రోజులే సెలవు ఇవ్వాలనే డిమాండ్ ఏళ్లుగా ఉంది. అలాగే జీతాల పెంపుపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే బ్యాంకు ఉద్యోగులకు కొన్ని రోజుల్లో శుభవార్త రానుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులకు 15 శాతం 20 శాతం జీతాలు పెరగనున్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. బ్యాంక్ యూనియన్లు, అసోసియేషన్లు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) మధ్య 12వ ద్వైపాక్షిక పరిష్కార చర్చలు చివరి దశకు చేరుకున్నందున ఐదు రోజుల పని వారం అమలు డిసెంబర్ మధ్య నాటికి అమలులోకి వచ్చే అవకాశం ఉందని ఆయా వర్గాలు తెలిపాయి. ఈ తాజా వార్త గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
బ్యాంకింగ్ రంగ చరిత్రలో వేతనాల పెంపు కోసం15 శాతంతో చర్చలు ప్రారంభించడం ఇదే మొదటిసారి. దీంతో వేతనాల పెంపు అనేది 15 నుంచి 20 శాతం మధ్య ఉండవచ్చని ఐబీఏ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐదు రోజుల పని వారానికి సంబంధించిన ప్రకటన జీతాల పెంపు నోటిఫికేషన్‌తో పాటు లేదా వెంటనే కేంద్రం లేదా ఐబీఏ ద్వారా చేస్తారని వివరిస్తున్నారు. పీఎస్‌బీ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న జీతాల ఒప్పందం నవంబర్ 1, 2022న ముగియడంతో ఈ పరిణామాలు చోటు చేసకుంటున్నారు. ఐబీఏ, మరియు బ్యాంక్ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్‌లు కొత్త వేతన ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నాయి. అంతేకాకుండా, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు కూడా వేతన సవరణ, పని దినాలలో మార్పు వర్తిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
జూలై 2020లో దాదాపు 850,000 మంది బ్యాంక్ ఉద్యోగులు తమ జీత ప్యాకేజీలలో 15 శాతం పెరుగుదలను పొందారు. ఐబీఏ, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్‌లు మూడు సంవత్సరాల వివాదాస్పద వేతన సవరణ సమస్యను పరిష్కరించడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. చర్చల ప్రక్రియలో భాగంగా ఐబీఏ, బ్యాంక్ యూనియన్‌లు త్వరలో ఒక చివరి సమావేశాన్ని ఉంటుందని, అక్కడే రెండు పార్టీలు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేస్తారని, ఇది తుది ఆమోదం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతారని తెలుస్తుంది.
జీతాల పెంపు విషయంలో డిసెంబర్ 1 నాటికి చర్చలను పూర్తి చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ రుణదాతలను కోరింది. ఐదు రోజుల పని వారం ప్రారంభమైన తర్వాత ఇక బ్యాంకులకు శని, ఆదివారాలు సెలవులు రానున్నాయి. అయితే కోల్పోయిన పని గంటలను భర్తీ చేయడానికి, ఉద్యోగులు వారం రోజులలో ఎక్కువ గంటలు పని చేయాల్సి రావచ్చు. అంటే ప్రస్తుత పని వేళల కంటే 30-45 నిమిషాలు అదనంగా పని చేయాల్సి వస్తుంది. సెలవు రోజుల్లో డిపాజిట్ విషయంలో ఇప్పటికే నగదు డిపాజిట్ మెషీన్లు అందుబాటులో ఉన్నా, ఈ రెండు రోజుల సెలవు దినాల కారణంగా చెక్కుల రిలీజ్‌పై ప్రభావం పడుతుందని వివరించారు. ప్రజలు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఎంచుకుంటున్నందున చెక్కుల వినియోగం తగ్గుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగులు ఐదు రోజుల పనిని కలిగి ఉన్నందున బ్యాంకర్లకు అదే ఎంపికను అందించాలని ఏళ్లుగా కోరడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి