
భారతదేశంలో బంగారు ఆభరణాలకు డిమాండ్ గత మూడు సంవత్సరాలుగా క్రమంగా తగ్గుతోంది. 2021లో 610 టన్నుల బంగారం కొనుగోలు జరిగింది. ఇది 2022లో 600 టన్నులకు, 2023లో 575 టన్నులకు, ఇప్పుడు 2024లో 563 టన్నులకు పడిపోయిందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే 2022తో పోలిస్తే రికార్డు స్థాయిలో 7% తగ్గుదలను గమనించవచ్చు. దీనికి అతి పెద్ద కారణం బంగారం ధరలో భారీ పెరుగుదల. 2024లో బంగారం ధర 15% పెరిగింది. దీని వలన సామాన్యులకు నగలు కొనడం అనేది ఖరీదైనదిగా మారింది. అలాగే, మొత్తం ధరలో 10-25% వరకు మేకింగ్ ఛార్జీలు ఠారెత్తిస్తున్నాయి. ఇవి కూడా జనాలు వీటిపై అనాసక్తి చూపడానికి ప్రధాన కారకంగా మారుతున్నాయి. అదనంగా, కొత్త తరం ఇప్పుడు బంగారాన్ని కుటుంబ వారసత్వ సంపదగా కాకుండా పెట్టుబడి కోణం నుండి మాత్రమే చూడటం ప్రారంభించింది.
బంగారు కడ్డీలు, కాయిన్ లకు డిమాండ్ పెద్దగా హెచ్చుతగ్గులకు గురికాలేదు. కానీ బంగారు ఇటిఎఫ్‌లతో పోలిస్తే అవి బలహీనపడుతున్నాయి. 2021లో 186 టన్నుల బంగారు కడ్డీలు, కాయిన్ల కొనుగోలు జరిగింది. ఇది 2022 నాటికి 173 టన్నులకు తగ్గింది. అయితే, 2023లో అది 185 టన్నులకు పెరిగింది. 2024లో అది 239 టన్నులకు చేరుకుంది. అయితే, ఇది స్వల్పకాలిక ధోరణి అని నిపుణులు భావిస్తున్నారు. దీనికి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా కారణమవుతున్నాయి. మొత్తానికి బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీర్ఘకాలంలో, బంగారు ఆభరణాల కంటే ఇటిఎఫ్ లు ఎక్కువ లాభదాయకమైన ఒప్పందంగా భావిస్తున్నారు.
బంగారంతో పోలిస్తే బంగారు ఇటిఎఫ్‌లు కొనడానికి, అమ్మడానికి సులభంగా, సౌకర్యవంతంగా ఉండటం వల్ల కూడా ఈ పెరుగుదల నమోదయ్యి ఉండవచ్చు. దీనిని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఎప్పుడైనా అమ్మవచ్చు. ఇది చాలా ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ముఖ్యంగా యువ పెట్టుబడిదారులకు ఇదొక మంచి ప్రత్యామ్నాయంగా కనపడుతోంది.
కేంద్ర బడ్జెట్ 2024లో పన్ను మార్పులు కూడా గోల్డ్ ఇటిఎఫ్‌ల ప్రజాదరణను పెంచాయి. గతంలో, బంగారు ఇటిఎఫ్‌లపై దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్‌టిసిజి) పన్ను 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉంచబడితే 20% ఉండేది. కానీ ఇప్పుడు, గోల్డ్ ఈటీఎఫ్‌లు 12 నెలలు ఉంచుకుంటేనే ఎల్టీసీజీ ప్రయోజనాలను పొందుతాయి. అంతే కాదు, దానిపై పన్ను ఇప్పుడు 12.5% మాత్రమే. అది కూడా ఎటువంటి ఇండెక్సేషన్ లేకుండా. అదే సమయంలో, బంగారం (నగలు, కడ్డీలు మరియు నాణేలు) పై ఈ ప్రయోజనాన్ని పొందడానికి, దానిని 24 నెలల పాటు ఉంచుకోవడం అవసరం. ఈ కారణంగా కూడా, పెట్టుబడిదారులు ఎక్కువగా బంగారు ఈటీఎఫ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.
భారతదేశంలో ముఖ్యంగా వివాహాలు, పండుగల సమయంలో బంగారు ఆభరణాలు దాని సాంస్కృతిక, సాంప్రదాయ అంశాలను నిలుపుకుంటాయి. కానీ ఇటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టే ధోరణి పెరుగుతోంది. రాబోయే కాలంలో, బంగారు ఇటిఎఫ్ డిజిటల్ బంగారం మార్కెట్ భౌతిక బంగారం కంటే వేగంగా వృద్ధి చెందుతుంది, ఎందుకంటే ఇది మరింత సురక్షితమైనది, అనుకూలమైనది, పన్ను అనుకూలమైనది.