
గోల్డ్ రేట్లు ఏడాది కాలంలో ఎడాపెడా పెరిగిపోయాయి. ఎవరూ ఊహించలేనంతగా రాకెట్‌లా దూసుకుపోయాయి. 100 శాతాన్ని మించి పసిడి పరుగులు తీసింది. దీంతో అవసరాల కోసం కొందరు, పెరుగుతున్న గోల్డ్ రేట్లను క్యాష్ చేసుకుందామని ఎందరో, ఎడాపెడా గోల్డ్ లోన్లు తీసుకున్నారు. బ్యాంకుల్లో కానీ, నాన్ బ్యాంకింగ్ సంస్థల నుంచి కానీ పెద్దఎత్తున చాలామంది బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. మరికొందరు ఏకంగా గోల్డ్‌తో గేమ్స్ ఆడారు. లోన్ తీసుకుని గోల్డ్ కొని, ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి, మళ్లీ గోల్డ్ కొన్నారు. ఇలా గోల్డ్ రన్‌ని క్యాష్ చేసుకునేందుకు పెద్ద సాహసమే చేశారు.
పడిపోయిన లోన్ టు వాల్యూ రేషియో
పసిడి పరుగులు తీసినన్నాళ్లు, బంగారం రేట్లు హద్దు లేకుండా కొనసాగుతున్నన్నాళ్లు…గోల్డ్ లోన్ల వ్యవహారం బాగానే నడిచింది. ఎప్పుడైతే పుత్తడి రేట్లు ఢమాల్‌మని ఒకేసారి 15 శాతం పడిపోయాయో, అప్పుడే కథ అడ్డం తిరిగింది. బంగారాన్ని తాకట్టు పెట్టి, భారీగా రుణాలు తీసుకున్నవాళ్లకు, అప్పు చేసి గోల్డ్ కొని, దాన్ని తాకట్టు పెట్టి, మళ్లీ గోల్డ్ కొన్నవాళ్లకు….ఇప్పుడు గోల్డ్‌తో గేమ్స్ ఆడితే ఏమవుతుందో అర్థం అవుతోంది. లోన్ టు వాల్యు రేషియో పడిపోవడం..వాళ్ల గుండెల్లో దడ పుట్టిస్తోంది.
గోల్డ్ విలువలో దాదాపు 90శాతం రుణం మంజూరు
బంగారాన్ని తాకట్టు పెట్టినప్పుడు, దాని విలువలో దాదాపు 80 నుంచి 90 శాతం రుణం మంజూరు చేస్తాయి బ్యాంకులు, NBFCలు. అంటే లక్ష రూపాయల గోల్డ్ తాకట్టు పెడితే, 80 వేల నుంచి 90 వేల రూపాయల దాకా రుణం వస్తుంది. దీన్నే లోన్ టు వాల్యు రేషియో అంటారు. గోల్డ్ రేట్లు పెరిగితే, ఈ LTV రేషియో కూడా పెరుగుతుంది. అంటే లక్ష రూపాయల విలువ చేసే బంగారం రేటు, లక్షన్నరకు చేరితే LTV రేషియో కూడా పెరుగుతోంది. అప్పుడు అదే బంగారం మీద మరికొంత రుణం టాప్‌అప్‌గా కూడా ఇస్తారు. అయితే గోల్డ్ రేటు పడిపోతే కనుక, లోన్ టు వాల్యూ రేషియో కూడా పడిపోతుంది. దీంతో లక్ష రూపాయల బంగారం గనక 70 వేలకు పడిపోతే…90 వేలు లోన్ తీసుకున్నవాళ్లకు ఇబ్బందులు తప్పవు. అప్పుడు LTV రేషియోను బట్టి, వాళ్లు తీసుకున్న అప్పు, గోల్డ్ రేటు కంటే తక్కువ ఉంటే, వెంటనే ఆ తేడాను చెల్లించాలి. లేకపోతే రీపేమెంట్ కోసం ఫైనాన్స్ సంస్థలు ఒత్తిడి చేస్తాయి. ఒకవేళ కట్టకపోతే, వాళ్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని అమ్మేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడే, ఆ బంగారాన్ని లిక్విడేట్ చేసుకునేందుకు సదరు సంస్థకు అధికారం ఇస్తూ సంతకం పెట్టేస్తాం. దీంతో గోల్డ్ రేట్లు ఇంకా పడిపోతే, బంగారాన్ని తాకట్టు పెట్టినవాళ్లకు, గోల్డ్ రన్‌ని క్యాష్ చేసుకునేందుకు జూదం ఆడినవాళ్లకు ఇబ్బందులు తప్పవు.
కమ్మోడిటీ మార్కెట్లలో కల్లోలం
ఇక కమ్మోడిటీ మార్కెట్లలో గోల్డ్ కొనేవాళ్లు, ముందుగా కొద్దిగానే పేమెంట్ చేస్తారు. ఇప్పుడు గోల్డ్ రేట్లు పడిపోవడంతో వాళ్లు భారీగా మార్జిన్ చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి, బ్రోకరేజ్ సంస్థల నుంచి ట్రేడర్స్‌కు ఇప్పటికే నోటీసులు వచ్చాయి. ఇక గోల్డ్ లోన్లు తీసుకున్నవాళ్లకు కూడా రేపోమాపో నోటీసులు ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి