మీరు కొత్త ఆర్థిక సంవత్సరంలో బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, ఈ వార్త మీకోసమే. ఏప్రిల్ 1వ తేదీ నుంచి బంగారం కొనుగోలు చేసే వారు కొత్త నిబంధనలను అనుసరించాలి. కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాల విక్రయ నిబంధనలను మారుస్తూ, నేటి నుంచి బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసింది. ఏప్రిల్ 1, 2023 నుంచి ఏదైనా బంగారు ఆభరణాలు సురక్షితంగా ఉండాలంటే దానిపై తప్పనిసరిగా 6-అంకెల హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (HUID) ఉండాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) కొత్త ఆర్థిక సంవత్సరంలో 6 అంకెల హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) లేకుండా ఏ దుకాణదారుడు బంగారు ఆభరణాలను విక్రయించలేరని పేర్కొంది. ఇలా హాల్‌మార్క్ లేని అభరణాలు విక్రయించినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
మార్చి 4, 2023న వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. ఇప్పుడు 6 నంబర్ హాల్‌మార్క్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. గతంలో 4 అంకెల, 6 అంకెల హాల్‌మార్క్‌ల విషయంలో చాలా గందరగోళం ఉండేది. ఇప్పుడు 4 అంకెల హాల్‌మార్క్‌ను తొలగించి 6 సంఖ్యల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్కింగ్ మాత్రమే చెల్లుబాటు అవుతుందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి స్పష్టం చేసింది. ఇది లేకుండా ఏ దుకాణదారుడు ఆభరణాలను విక్రయించడానికి వీలులేదు. గత ఏడాదిన్నరగా దేశంలో నకిలీ ఆభరణాల విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త హాల్‌మార్కింగ్ నిబంధనలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది.
ఏదైనా ఆభరణం స్వచ్ఛతను గుర్తించడానికి దానికి 6 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఇవ్వబడుతుంది. దీన్ని హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడీ) నంబర్ అంటారు. ఈ నంబర్ ద్వారా మీరు ఈ ఆభరణాల గురించిన మొత్తం సమాచారాన్ని పొందుతారు. ఈ నంబర్‌ని స్కాన్ చేయడం ద్వారా కస్టమర్‌లు నకిలీ బంగారం లేదా కల్తీ ఆభరణాలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది బంగారం స్వచ్ఛత ధృవీకరణ పత్రం లాంటిది. జూన్ 16, 2021 వరకు హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలకు ఇది తప్పనిసరి కాదని గమనించాలి. కానీ జూలై 1, 2021 నుంచి ప్రభుత్వం 6 అంకెల హెచ్‌యూఐడీని ప్రారంభించింది. దేశంలో హాల్‌మార్కింగ్‌ను సులభతరం చేయడానికి, ప్రభుత్వం 85 శాతం ప్రాంతాల్లో హాల్‌మార్కింగ్ కేంద్రాలను ప్రారంభించింది.
ఏప్రిల్ 1, 2023 నుంచి బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి అయినప్పటికీ, కస్టమర్ పాత ఆభరణాలను విక్రయించడానికి వెళితే, అతనికి హాల్‌మార్కింగ్ అవసరం లేదు. ప్రజలు విక్రయించే పాత ఆభరణాలను విక్రయించాలనే నిబంధనలో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. పాత ఆభరణాలను 6 అంకెల హాల్‌మార్క్ లేకుండా కూడా విక్రయించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి