
Gold, Silver Prices: ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా డిసెంబర్ 26న బంగారం, వెండి ధరలు చరిత్రలోనే అత్యధిక స్థాయిలకు చేరుకున్నాయి. బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం, స్పాట్ గోల్డ్ ధర ఒక దశలో 1.2 శాతం పెరిగి ఔన్సుకు 4,530 అమెరికన్ డాలర్లను దాటింది. వెనిజులాలో అమెరికా ప్రభుత్వం చమురు ట్యాంకర్లను అడ్డుకోవడం, నికోలాస్ మదురో ప్రభుత్వంపై అమెరికా, అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి పెంచడం వంటి చర్యలు పెట్టుబడిదారులను సురక్షిత పెట్టుబడులైన బంగారం వైపు ఆకర్షిస్తున్నాయి. ఇదే సమయంలో ఆఫ్రికాలోని నైజీరియాలో ఉగ్రవాద సంస్థపై అమెరికా శక్తివంతమైన దాడి నిర్వహించిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ పరిణామాలన్నీ బంగారం డిమాండ్‌ను మరింత పెంచాయి.
వెండి ధరలు ఐదో వరుస రోజు కూడా పెరుగుతూ, గ్లోబల్ మార్కెట్‌లో ఔన్సుకు 75 డాలర్లను తొలిసారిగా దాటాయి. ఒక దశలో వెండి ధర 4.5 శాతం వరకు పెరిగినట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. అక్టోబర్‌లో చోటుచేసుకున్న చారిత్రక ‘షార్ట్ స్క్వీజ్’ తర్వాత కీలక ట్రేడింగ్ కేంద్రాల్లో సరఫరా సమస్యలు, ఊహాజనిత కొనుగోళ్లు ఈ ర్యాలీకి ప్రధాన కారణాలుగా మారాయి.
ఇది కూడా చదవండి: January Bank Holiday: వచ్చే ఏడాది జనవరిలో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..!
అమెరికన్ డాలర్ బలాన్ని సూచించే బ్లూమ్‌బర్గ్ డాలర్ స్పాట్ ఇండెక్స్ ఈ వారం 0.8 శాతం తగ్గింది. ఇది జూన్ తర్వాత అతిపెద్ద వారపు పతనం. సాధారణంగా డాలర్ బలహీనపడితే బంగారం, వెండి ధరలకు మద్దతు లభిస్తుంది. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధరలు సుమారు 70 శాతం పెరిగితే, వెండి ధరలు 150 శాతం కంటే ఎక్కువగా ఎగబాకాయి. కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు, గోల్డ్ ETFలలో నిరంతర పెట్టుబడులు, అలాగే ఈ ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేసిన మూడు వడ్డీ రేట్ల కోతలు ఈ పెరుగుదలకు కారణమయ్యాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, మే నెలను మినహాయిస్తే ఈ ఏడాది ప్రతి నెలా గోల్డ్-బ్యాక్డ్ ETFలలో నిల్వలు పెరిగాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రెషస్ మెటల్స్ ETF అయిన SPDR గోల్డ్ ట్రస్ట్‌లో ఉన్న ఆస్తులు 2025లో ఇప్పటివరకు 20 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి.
డిసెంబర్ 26న ఫ్యూచర్స్ ట్రేడులో వెండి ధరలు రూ. 8,951 పెరిగి కిలోకు రూ. 2,32,741కు చేరాయి. ఇది ఆల్‌టైమ్ రికార్డు. వెండి ఫ్యూచర్స్ 4 శాతం లాభపడ్డాయి. డిసెంబర్ 18 తర్వాత వెండి ధరలు మొత్తం రూ. 29,176 పెరిగి 14.33 శాతం వృద్ధిని నమోదు చేశాయి. బంగారం కూడా కొత్త రికార్డును సృష్టించింది. ఈ ఏడాది వెండి ర్యాలీ బంగారాన్ని మించి ఉంది. అక్టోబర్ తర్వాత లండన్ వాల్ట్స్‌కు వెండి భారీగా చేరుతున్నప్పటికీ, ప్రపంచంలోని ఎక్కువ వెండి నిల్వలు న్యూయార్క్‌లోనే ఉన్నాయి. ఇదిలా ఉండగా, కీలక ఖనిజాల దిగుమతులు జాతీయ భద్రతకు ముప్పుగా మారతాయా అనే అంశంపై అమెరికా వాణిజ్య శాఖ దర్యాప్తు చేపట్టడం ట్రేడర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్లాటినం ధరలు 4.8 శాతం పెరిగి 2,381.53 డాలర్లకు చేరాయి.
ప్రస్తుతం దేశీయంగా బంగారం ధరలను పరిశీలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,000 వద్ద కొనసాగుతుండగా, కిలో వెండి ధర రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి