
గ్యాస్ కొరత క్రమంలో దేశ ప్రజలందరూ అప్రమత్తమయ్యారు. గ్యాస్ ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. గ్యాస్ కొరత లేదని, అనవసరంగా బుక్ చేసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భయాందోళనలతో అవసరం లేకపోయినా గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్నారు. దీంతో ఏజెన్సీలు గ్యాస్ సరఫరా చేయడంలో జాప్యం జరుగుతోంది. ఒకేసారి పెద్ద మొత్తంలో ఆర్డర్లు రావడంతో గ్యాస్ డెలివరీ చేయడానికి ఆలస్యం అవుతుందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. బుకింగ్ చేసుకున్న తర్వాత రెండున్నర రోజుల్లోనే గ్యాస్ డెలివరీ చేస్తామని కేంద్రం ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో ఇది అమలవ్వడం లేదు.
అయితే ఆన్‌లైన్ వెబ్ సైట్లు, యాప్స్, యూపీఐ యాప్స్‌లో గ్యాస్ బుక్ అవ్వడం లేదా..? అయితే మీరు టోల్ ఫ్రీ నెంబర్, ఐవీఆర్ఎస్, మిస్డ్ కాల్ విధానం ద్వారా గ్యాస్ సులువుగా బుక్ చేసుకోవచ్చు. గ్యాస్ సరఫరా కంపెనీలన్నీ మొబైల్ కాల్స్ ద్వారా గ్యాస్ రీఫిల్లింగ్ కోసం బుకింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
మీరు ఇండేన్ గ్యాస్ వినియోగదారులు అయితే 18002333555 టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు. ఇక 7718955555 నెంబర్‌కు కాల్ చేసి ఐవీఆర్‌ఎస్ విధానం ద్వారా బుక్ చేయొచ్చు. ఇక 8454955555 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా గ్యాస్ సిలిండర్‌కు ఆర్డర్ పెట్టవచ్చు.
ఇక భారత్ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నట్లయితే.. 1800224344 టోల్ ఫ్రీ నెంబర్, 7715102345 ఐవీఆర్ఎస్, 7710955555 మిస్డ్ కాల్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.
ఇక హెచ్‌పీ వినియోగదారులు అయి ఉంటే 18002333555 టోల్ ఫ్రీ, 9493602222, 9493602222 మిస్డ్ కాల్ నెంబర్ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు
ఇక గ్యాస్ లీకేజ్ అయితే 1906 ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్‌ను సంప్రదించవచ్చు. ఇది 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. గ్యాస్ లీకేజీ సమయంలో అత్యవసర సేవలు పొందేందుకు ఇది సహాయపడుతుంది.
అటు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని మరోసారి స్పష్టం చేసింది. ప్రజలెవ్వరూ ఆందోళన పడి గ్యాస్ బుకింగ్ చేసుకోవద్దని సూచించింది. త్వరలోనే కమర్షియల్ గ్యాస్ సరఫరాను కూడా మొదలుపెడతామని, రాష్ట్రాలతో దీనిపై చర్చిస్తున్నట్లు తెలిపింది. ప్రాధాన్యతా క్రమంలో వాణిజ్య సిలిండర్లను కూడా డెలివరీ చేస్తామని స్పష్టం చేసింది. అటు హర్ముజ్ జలసంధి ద్వారా రెండు నౌకలు, గల్ప్ దేశాల నుంచి మరో రెండు నౌకలు వస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఇవి దేశానికి వచ్చే అవకాశముంది.