Indra Nooyi: ‘ఎప్పుడూ.. ఎవర్నీ.. జీతం పెంచమని అడగలేదు’.. ఇంద్రా నూయి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ.. వివరణ ఇచ్చిన పెప్సికో మాజీ సీఈవో

| Edited By: Anil kumar poka

Oct 09, 2021 | 3:17 PM

ఇంద్రా నూయి.. భారత్‌లో పుట్టి పెరిగిన ఆమె.. అమెరికా దిగ్గజ సంస్థ పెప్సీకో‌ సంస్థను అత్యంత విజయవంతంగా ముందుకు నడిపారు.

Indra Nooyi: ‘ఎప్పుడూ.. ఎవర్నీ.. జీతం పెంచమని అడగలేదు’.. ఇంద్రా నూయి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ.. వివరణ ఇచ్చిన పెప్సికో మాజీ సీఈవో
Indra Nooyi
Follow us on

Indra Nooyi: ఇంద్రా నూయి.. భారత్‌లో పుట్టి పెరిగిన ఆమె.. అమెరికా దిగ్గజ సంస్థ పెప్సీకో‌ సంస్థను అత్యంత విజయవంతంగా ముందుకు నడిపారు. ప్రపంచ వ్యాపార రంగంలో అత్యంత విజయవంతమైన లీడర్లలో ఒకరుగా ఆమె గుర్తింపు సాధించారు. 12 ఏళ్ల పాటు పెప్సికో సీఈవోగా సేవలందించిన ఇంద్రా నూయి 2018 ఆగస్టులో ఈ పదవి నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఆమె అమెజాన్ బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఒకరుగా ఆమె గుర్తింపు సాధించారు. 2017లో ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో 11వ స్థానంలో నిలిచిన ఇంద్రా నూయి.. యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. చెన్నైలో పుట్టిన ఇంద్రా నూయి.. మద్రాస్ క్రిస్టియల్ కాలేజ్‌లో డిగ్రీ చదివారు. అనంతరం ఐఐఎం కల్‌కత్తాలో బిజినెస్ట మేనేజ్‌మెంట్ చదువుకున్నారు. అనంతరం అమెరికాలోని యేల్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదవువుకునేందుకు అక్కడకు వెళ్లారు.

అంతర్జాతీయ వేదికపై ఇంద్రా నూయి సాధించిన విజయం ఎందరో భారతీయులకు స్ఫూర్తినిచ్చింది. న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన వృత్తి జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ఆమె వెల్లడించారు. తన జీతం పెంచమని కెరీర్‌లో ఎన్నడూ ఎవర్నీ అడగలేదని ఆమె తెలిపారు. ఒకరి దగ్గర పనిచేస్తూ.. తన జీతం సరిపోవడం లేదని చెప్పడం తనకెందుకో ఇబ్బందికరంగా అనిపిస్తుందని చెప్పారు. జీతం గురించి చాలాసార్లు తన భర్తతో కూడా చర్చించినట్లు చెప్పారు. అయితే ఆయన ఒకే మాట చెప్పేవారని.. మనం అనుకున్నదానికంటే ఎక్కువే సంపాదించాం.. దాని గురించి మర్చిపో అనేవారని తెలిపారు. ఒకానొక సమయంలో సంస్థ ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు తన జీతం పెంచినా.. దాన్ని తిరస్కరించినట్లు తెలిపారు.

అయితే ఇంద్రా నూయి జీతంపై చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. సీఈవోగా పనిచేసిన ఆమెకు సాధారణ ఉద్యోగుల జీతం వెతలు తెలిసి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం ఆమెకు ఉండకపోవచ్చు.. సామాన్య ఉద్యోగుల పరిస్థితి అలా ఉండదని కామెంట్స్ చేస్తున్నారు. 2017లో ఆమె వార్షిక జీతం 31 మిల్లియన్ డాలర్లుగా ఉండేదని గుర్తుచేస్తున్నారు.  మరికొందరు మాత్రం ఎప్పుడు జీతంపై దృష్టిపెట్టకుండా.. కష్టపడి పనిచేస్తే జీతం తనంతట అదే పెరుగుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.

జీతంపై వ్యాఖ్యలకు ఇంద్రా నూయి వివరణ..

తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇంద్రా నూయి దీనిపై క్లారిటీ ఇచ్చారు. తన కెరీర్‌లో ఏం జరిగిందో అది వాస్తవంగా చెప్పినట్లు తెలిపారు. అయితే ఇదే సరైన విధానమని.. దీన్ని అందరూ పాటించాలని తాను ఎవరికీ బోధించడం లేదని,  సలహా ఇవ్వడం లేదని, సిఫార్సు చేయడం లేదని స్పష్టంచేశారు. జీతం విషయంలో తనను స్ఫూర్తిగా తీసుకోవాలని తాను ఎవర్నీ కోరడం లేదని ఇంద్రా నూయి సూచించారు.

Also Read.

NASA Mars Mission: మార్స్ పై జీవం ఉనికిని తెలుసుకోవడంలో నాసా పురోగతి..నది ఆనవాళ్ళను పసిగట్టిన పర్‌సెవరెన్స్ రోవర్!

Inspiring Story: సాధారణ కుటుంబానికి చెందిన ఈ తండ్రికూతుళ్లు ఎందరికో ఆదర్శం.. కేంద్ర మంత్రి ట్వీట్‌..!