భారత్‌లోకి వెల్లువెత్తుతున్న విదేశీ పెట్టుబడులు.. నార్వేలో కుదిరిన EFTA వాణిజ్య ఒప్పందం..!

యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA)తో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు భారతీయ వస్తువులు, సేవల కోసం పెద్ద మార్కెట్‌లను తెరవడం ఈ పర్యటన ముఖ్య లక్ష్యం.

భారత్‌లోకి వెల్లువెత్తుతున్న విదేశీ పెట్టుబడులు.. నార్వేలో కుదిరిన EFTA వాణిజ్య ఒప్పందం..!
Efta Free Trade Agreement
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 24, 2024 | 4:45 PM

భారతదేశం ప్రగతి పథంలో వేగంగా దూసుకుపోతోంది. ఇందుకోసం విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇటీవలే జర్మనీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పెట్టుబడులకు భారతదేశం ఉత్తమమైన ప్రదేశం అని అన్నారు. ఇప్పుడు భారత వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ నార్వే పర్యటనలో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈమేరకు 100 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 8.44 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎంవోయూ కుదుర్చుకున్నారు.

దాని ప్రయోజనం ఏమిటి?

యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA)తో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు భారతీయ వస్తువులు, సేవల కోసం పెద్ద మార్కెట్‌లను తెరవడం ఈ పర్యటన ముఖ్య లక్ష్యం. EFTAలో ఐస్‌ల్యాండ్, లీచ్‌టెన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్ ఉన్నాయి. భారతదేశం EFTA దేశాల మధ్య TEPA ఒప్పందం మార్చి 2024లో సంతకం చేశాయి. ఈ ఒప్పందం భారతీయ ఉత్పత్తులకు EFTA మార్కెట్‌లో 99.6% యాక్సెస్‌ను అందిస్తుంది. వ్యవసాయేతర, ప్రాసెస్ చేసిన వ్యవసాయ వస్తువులపై సుంకం రాయితీలను అందిస్తుంది. ప్రతిఫలంగా, భారతదేశం తన 82.7% టారిఫ్ లైన్లను EFTA దేశాలకు తెరవడానికి అంగీకరించింది.

అమలులోకి TEPA ఒప్పందం

నార్వేలో, బార్త్‌వాల్ వాణిజ్య, పరిశ్రమలు, మత్స్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర కార్యదర్శి టోమస్ నార్వోల్‌తో సహా పలువురు సీనియర్ అధికారులను కలిశారు. ఈ సమావేశాలలో భారత ఎగుమతులను ప్రోత్సహించడం, TEPAముందస్తు అమలు గురించి చర్చించారు. వాణిజ్య కార్యదర్శి నార్వేజియన్ పార్లమెంటు సభ్యులను కూడా కలుసుకున్నారు. ఒప్పందం ప్రయోజనాలను వెల్లడించారు. నార్వేజియన్ వ్యాపార వాటాదారులతో చర్చల్లో, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అందించే అవకాశాలను బార్త్వాల్ వివరించారు. రానున్న 3-4 ఏళ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతోందని చెప్పారు.

భారతీయ వస్తువుల ఎగుమతి

మేక్ ఇన్ ఇండియా, స్వావలంబన భారత్ ప్రచారాన్ని బలోపేతం చేయడంలో TEPA ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ఒప్పందం మౌలిక సదుపాయాలు, తయారీ, ఫార్మాస్యూటికల్స్, రసాయనాలు, ఫుడ్ ప్రాసెసింగ్, రవాణా, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు వంటి రంగాలలో పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఈ ఒప్పందం వల్ల వచ్చే 15 ఏళ్లలో భారత్‌లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని, వృత్తి, సాంకేతిక శిక్షణను మెరుగుపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే, ఇది పునరుత్పాదక శక్తి, ఆరోగ్య శాస్త్రాలు, పరిశోధనలలో ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..