ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం.. టైర్–2 నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాలకు గ్రోసరీ సేవలను విస్తరించేందుకు నిర్ణయం
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మెట్రో నగరాల్లోనే అందిస్తున్న ఈ–కిరాణా సేవలను టైర్–2 నగరాల్లో కూడా అందించాలని నిర్ణయం ..
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మెట్రో నగరాల్లోనే అందిస్తున్న ఈ–కిరాణా సేవలను టైర్–2 నగరాల్లో కూడా అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ తన గ్రోసరీ సేవలను తెలుగు రాష్ట్రాలకు చెందిన వరంగల్, తిరుపతి నగరాలతో పాటు 50కి పైగా నగరాలకు విస్తరించేందుకు సిద్ధమైంది. అయితే ఈ జాబితాలో కోల్‌కతా, అహ్మదాబాద్, పూణే వంటి 7 పెద్ద నగరాలతో పాటు మైసూర్, అలహాబాద్, కాన్పూర్, అలీగఢ్, రాజ్‌కోట్, వడోదర, జైపూర్, చండీగఢ్,తిరుపతి, వెల్లూరు, డయ్యూ డామన్తో సహా 40కి పైగా టైర్–2 నగరాలను కూడా చేర్చింది. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఈ–గ్రోసరీ సేవలతో అధిక -నాణ్యత గల కిరాణా ఉత్పత్తులను ఆఫర్ల కింద ఫాస్ట్ డెలివరీ చేస్తామని ప్రకటించింది.
అధిక శాతం మంది కస్టమర్లకు మరింత సురక్షితమైనదిఆ, సులభతరమైనదిగా కిరాణా షాపింగ్ ను అందించేందుకే ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు సదరు సంస్థ తాజా ప్రకటనలో పేర్కొంది. కాగా, కోవిడ్ -19 కారణంగా ఆన్‌లైన్ షాపింగ్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కరోనా ప్రభావంతో ప్రతిది ఆన్‌లైన్ నుంచే షాపింగ్ చేయడం ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని, ఇతర ఇబ్బందులను దృష్టిలో ఇంటి వద్దకు వస్తువులను తెప్పించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో, కరోనా సమయంలో ఆన్‌లైన్ షాపింగ్, ఈ–గ్రోసరీ వంటివి మెట్రో నగరాలను మించి టైర్ II నగరాల్లో గణనీయమైన వృద్ధిని సాధించాయి. గత ఏడాది ఫ్లిప్‌కార్ట్ కూడా తన ఈ–గ్రోసరీ బిజినెస్‌లో మూడు రెట్ల వృద్ధిని సాధించింది. కాగా, కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ ప్రకారం, 2020 లో 3.3 బిలియన్ డాలర్ల విలువతో ఉన్న ఈ–గ్రోసరీ బిజినెస్ 2025 నాటికి 24 బిలియన్ డాలర్ల జిఎమ్‌వి (స్థూల మర్చండైజ్ వాల్యూ) ను చేరుకోనున్నట్లు ఒక అంచనా.
కరోనా కారణంగా వినియోగదారుల నుండి నాణ్యమైన ఆహారం, గృహోపకరణాల డిమాండ్ పెరగడంతో ఈ–గ్రోసరీ బిజినెస్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీంతో ఫ్లిప్‌కార్ట్ తన ఈ–గ్రోసరీ సేవలను మరిన్ని నగరాలకు విస్తరించాలని నిర్ణయించామని ప్లిప్‌కార్ట్ పేర్కొంది. ఇందుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా మా కిరాణా కార్యకలాపాలను పెంచడానికి, మా సేవలను బలోపేతం చేయడానికి మరిన్ని పెట్టుబడులు పెట్టాం. కస్టమర్లు కాంటాక్ట్‌లెస్ షాపింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం కారణఃగా గత ఏడాదిలో టైర్ -2 నగరాల నుండి కిరాణా కోసం చాలా డిమాండ్ పెరిగిందని తెలిపింది. రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో మా సేవలు కొనసాగుతాయని ఆశిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కిరాణా, జనరల్ మర్చండైజ్, ఫర్నిచర్ మనీష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.