
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు భారీ ఊరట కలిగింది. ఈపీఎఫ్‌వో 3.0లో భాగంగా నగదు విత్ డ్రాలను వేగవంతం చేస్తోంది. అందులో భాగంగా త్వరలో ఏటీఎం నుంచి డబ్బులను ఉపసంహరించుకునే సౌకర్యాన్ని తీసుకురానుంది. ఇది అందుబాటులోకి వస్తే పీఎఫ్ సొమ్మును ఏదైనా బ్యాంక్ ఏటీఎం నుంచి సులువుగా సెకన్లలోనే విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం పీఎఫ్ డబ్బులను తీసుకోవాలంటే ప్రక్రియ చాలా క్లిష్టతరంగా ఉంది. మూడు రోజుల వరకు సమయం పడుతుంది. ఈపీఎఫ్‌వో పోర్టల్‌లోకి వెళ్లి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక నుంచి అలాంటి పని ఉండదు. మీ సమీపంలోని ఏటీఎం నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు.
ఈపీఎఫ్‌వో తమ ఖాతాదారులకు ఒక ప్రత్యేక ఏటీఎం కార్డులను జారీ చేస్తుంది. ఈ కార్డును మీరు డెబిట్ కార్డులా ఉపయోగించుకోవచ్చు. మీ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 25 శాతం మినహా మిగతా 75 శాతం సొమ్మును మీరు ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. మీ సమీపంలోని ఏ బ్యాంక్ ఏటీఎం నుంచి అయినా ఉపసంహరించుకోవచ్చు. ఏటీఎం సౌకర్యం ద్వారా ఒకేసారి రూ.2 లక్షల వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం కేంద్రం కల్పించనుందని వార్తలు వస్తున్నాయి. ఇక 3 సంవత్సరాల సర్వీస్ తర్వాత రూ.2 లక్షలు విత్ డ్రా చేస్తే… 10 శాతం టీడీఎస్ కట్టాల్సి ఉంటుంది. అదే ఐదు సంవత్సరాల తర్వాత చేస్తే ఎలాంటి ట్యాక్సులు ఉండవు.
వైద్య, ఇంటి ఖర్చులు, ఉద్యోగం కోల్పోయిన సమయంలో అత్యవసర నగదు అవసరాల కోసం పీఎఫ్ మొత్తం నగదులో 75 శాతం తీసుకోవచ్చు. ఇక మిగతా 25 శాతం ఉద్యోగం మానేశాక తీసుకోవచ్చు. ఇక 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేస్తే.. పీఎప్ విత్ డ్రాలకు ఎలాంటి పన్ను ఉండదు. ఇక 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయకపోతే ట్యాక్స్ విధిస్తారు. అటు త్వరలో యూపీఐ ద్వారా పీఎఫ్ చందాలను తీసుకునే సౌకర్యం ఈపీఎఫ్‌వో కల్పించనుంది. ఏప్రిల్ నుంచి ఈ సదుపాయం ప్రవేశపెడతారని తెలుస్తోంది. తొలుత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బీమ్ యాప్‌లో ఈ ఫీచర్ తీసుకురానున్నారు. అనంతరం ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే లాంటి మిగతా యాప్స్‌లలో కూడా ప్రవేశపెట్టనున్నారు.