భారతదేశంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అధిక వేతనాలపై పెన్షన్‌లకు సంబంధించిన ఎంపికలు/జాయింట్ ఆప్షన్‌ల ధ్రువీకరణ కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి, అప్‌లోడ్ చేయడానికి యజమానులకు తుది పొడిగింపును మంజూరు చేసింది. కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ పొడిగింపు అవసరమైన దరఖాస్తులను పూర్తి చేయడానికి యజమానులకు మరికొంత సమయం తీసుకునే వెసులుబాటును కల్పిస్తుంది. నవంబర్ 4, 2022 నాటి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా దరఖాస్తులను సమర్పించడానికి ఆన్‌లైన్ సౌకర్యం మొదట ఫిబ్రవరి 26, 2023న ప్రారంభించారు. క్రమేపి అది మే 3, 2023 వరకు పొడగించారు.
తదుపరి అర్హులైన పింఛనుదారులు, సభ్యులు తమ దరఖాస్తులను సమర్పించడానికి పూర్తి నాలుగు నెలల పాటు అనుమతించడానికి గడువును మొదట జూన్ 26, 2023 వరకు పొడిగించారు. దరఖాస్తు సమర్పణలకు చివరి గడువు జూలై 11, 2023న సెట్ చేయడంతో మరో 15 రోజుల గ్రేస్ పీరియడ్ మంజూరు చేశారు. గ్రేస్ పీరియడ్ తేదీ నాటికి ఈపీఎఫ్ఓకి మొత్తం 17.49 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అవసరమైన వేతన వివరాలను సమర్పించడానికి అనేకసార్లు పొడిగింపులు ఉన్నప్పటికీ 3.1 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ఈపీఎఫ్ఓ గమనించింది. ఈ మేరకు అవసరమైన వేతన డేటాను అప్‌లోడ్ చేయడంలో యజమానులు అనే సవాళ్లను ఎదుర్కొన్నారు. గడువును పొడిగించాలని దఫదఫాలుగా ఈపీఎఫ్ఓను అభ్యర్థించారు.
యజమానుల అభ్యర్థనలకు అనుగుణంగా ఈపీఎఫ్ఓ మిగిలిన దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి, అప్‌లోడ్ చేయడానికి యజమానులకు జనవరి 31, 2025 చివరి గడువును నిర్ణయించింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల గడువు పొడిగింపుతో పాటు అదనపు సమాచారం కోరిన 4.66 లక్షల కేసుల్లో అప్‌డేట్‌లు లేదా స్పష్టీకరణలను అందించాల్సిందిగా ఈపీఎఫ్ో యాజమాన్యాలను అభ్యర్థించింది. ఈ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా చూసుకోవడానికి యజమానులు జనవరి 15, 2025లోపు ప్రతిస్పందించాలని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఈ పొడిగింపు పింఛను ధ్రువీకరణ కోసం పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను ప్రాసెస్ చేసి, అప్‌లోడ్ చేయడానికి చివరి అవకాశంగా భావించాలని ఈపీఎఫ్ఓ యజమానులకు స్పష్టం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి