EPFO: ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇకనుంచి ఎప్పుడంటే అప్పుడే డబ్బులు..

|

Mar 26, 2025 | 8:33 AM

పీఎఫ్‌ విత్‌డ్రా చిక్కులకు కేంద్రం చెక్‌ పెడుతోంది. జూన్‌ నుంచి పీఎఫ్‌ నిధులను యూపీఐ, ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఆటోమేటెడ్‌ సిస్టమ్‌ విధానంలో 1 లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చని చెప్పారు. కోరుకున్న అకౌంట్‌కు ఆ నగదును బదిలీ చేసుకోవచ్చని కార్మికశాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా ప్రకటించారు.

EPFO: ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇకనుంచి ఎప్పుడంటే అప్పుడే డబ్బులు..
Epfo
Follow us on

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. పీఎఫ్ నిధుల ఉపసంహరణను ఇకపై సులభతరం చేయనుంది. త్వరలో యూపీఐ ద్వారా నగదు విత్‌ డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్ ప్రతిపాదనలకు కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఆ శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా తెలిపారు. మే లేదా జూన్‌ నుంచి ఉద్యోగులు పీఎఫ్‌ మొత్తాలను ఏటీఎం, యూపీఐ ద్వారా విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. ప్రావిడెండ్‌ ఫండ్స్‌ నిధులు పొందే విషయంలో చందాదారులు అనూహ్య మార్పులు చూడబోతున్నారని తెలిపారు. కేవలం నగదు విత్‌డ్రా మాత్రమే కాకుండా.. పీఎఫ్‌లో ఎంత మొత్తం ఉందో కూడా యూపీఐ ద్వారా చూసుకోవచ్చని చెప్పారు.

ఆటోమేటెడ్‌ సిస్టమ్‌ విధానంలో 1 లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చని చెప్పారు. కోరుకున్న అకౌంట్‌కు ఆ నగదును బదిలీ చేసుకోవచ్చని కార్మికశాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా ప్రకటించారు. డిజిటలైజ్‌ చేయడంలో ఈపీఎఫ్‌ఓ గణనీయమైన పురోగతి సాధించిందని దావ్రా పేర్కొన్నారు. విత్‌డ్రా సదుపాయాన్ని క్రమబద్ధీకరించడానికి 120కి పైగా డేటాబేస్‌లను ఏకీకృతం చేసిందని తెలిపారు. అంతేకాదు.. క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయం కూడా కేవలం 3 రోజులకు తగ్గిందని చెప్పారు. 95 శాతం క్లెయిమ్‌లు ఆటోమేటెడ్‌ ప్రాసెస్‌ రూపంలో జరుగుతున్నాయన్నారు.

యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్‌ విత్‌ డ్రా ఆప్షన్‌ అనేది ఒక మైలురాయి అని.. ఈ సదుపాయంతో లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుందని సుమిత్రా దావ్రా చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్‌ నిధులను ఉపసంహరించుకోవడం కొన్నిసార్లు సంక్లిష్టంగా మారుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి ఈపీఎఫ్‌ఓ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..