EPF Withdraw: ఈపీఎఫ్ విత్‌డ్రా మరింత సులువు.. యూపీఐ ద్వారా ప్రాసెస్ కంప్లీట్

భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులకు రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భరోసా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ ద్వారా ప్రత్యేక పథకాన్ని అందుబాటులో ఉంచింది. నెలవారీ చందాలతో నడిచే పీఎఫ్ స్కీమ్ ఆర్థిక అత్యవసర సమయాల్లో మన పొదుపులో సొమ్మును పొందే వెసులుబాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో పీఎఫ్ విత్‌డ్రా విషయంలో కేంద్రం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది.

EPF Withdraw: ఈపీఎఫ్ విత్‌డ్రా మరింత సులువు.. యూపీఐ ద్వారా ప్రాసెస్ కంప్లీట్
Epf Withdraw

Updated on: Feb 27, 2025 | 2:53 PM

ఈపీఎఫ్ నిధుల ఉపసంహరణ ప్రక్రియను సులభతరం చేయడానికి యునైటెడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) క్లెయిమ్‌ల పరిష్కార ఎంపికను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇటీవల క్లెయిమ్ తిరస్కరణల కారణంగా తరచుగా తమ పొదుపు డబ్బును పొందలేని ఉద్యోగులకు ఈ చర్యలు చాలా ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 2024లో విడుదలైన వార్షిక నివేదిక ప్రకారం ప్రతి మూడు ఈపీఎఫ్ తుది పరిష్కార క్లెయిమ్స్‌లో ఒకటి తిరస్కరణకు గురవుతుంది. కాబట్టి యూపీఐ లేదా ఏటీఎం కార్డుల ద్వారా ఈపీఎఫ్ ఉపసంహరణ సౌకర్యాన్ని ప్రవేశపెట్టడం వల్ల పొదుపులు వేగంగా, సులభంగా అందుబాటులోకి వస్తాయి. అయితే యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ విధానం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఈపీఎఫ్ సభ్యులు ఇకపై తమ పొదుపులను జీపే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఉపసంహరించుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టడానికి ఈపీఎఫ్ఓ ​​నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చర్చలు జరుపుతుంది. ప్రభుత్వం చేపట్టిన ఈపీఎఫ్ఓ ​​3.0 చొరవలో భాగంగా  ఈపీఎఫ్ సభ్యులు తమ విరాళాలను ఏటీఎం ద్వారా కూడా పొందవచ్చని కార్మిక కార్యదర్శి సుమితా దావ్రా ఇటీవల తెలిపారు.  ఈ ఏడాది మే లేదా జూన్ నాటికి యూపీఐ ద్వారా ఈపీఎఫ్ ఉపసంహరణ అమలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో ఈపీఎఫ్ఓ ​​3.0ని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం. జూన్ 2025 నాటికి ఈపీఎఫ్ఓ ​​చందాదారుల కోసం కొత్త మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. 

ప్రజలకు చెల్లింపు ప్రక్రియను సులభతరం చేసిన యూపీఐ చెల్లింపుల మాదిరిగానే యూపీఐ ద్వారా ఈపీఎఫ్ ఉపసంహరణ సర్వీస్ అందుబాటులోకి తీసుకువస్తే ​​సభ్యుల పొదుపులను సులభంగా యాక్సెస్ చేయడానికి వీలు ఉంటుంది. ముఖ్యంగా క్లెయిమ్ వ్యవధిని 2 నుంచి 3 రోజుల నుంచి గంటలు లేదా నిమిషాలకు కూడా తగ్గిస్తుంది. ప్రస్తుత ఈపీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియకు 2-3 రోజులు పడుతుంది. యూపీఐ ద్వారా ఈపీఎఫ్ ఉపసంహరణ క్లెయిమ్ తిరస్కరణల అవకాశాలను కూడా తొలగిస్తుంది. అలాగే లావాదేవీల పారదర్శకతను కూడా పెంచుతుంది. ఇప్పటివరకు ఈపీఎఫ్ఓకు సంబంధించిన యూపీఐ ఉపసంహరణ సౌకర్యం గురించి అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈపీఎఫ్ఓ ​​అధికారిక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మాత్రమే మరిన్ని వివరాలు స్పష్టంగా తెలుస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి