EPF Tax: పీఎఫ్ వడ్డీతో పన్ను చిక్కులు.. నోటీసులు రాకుండా తప్పించుకోండిలా!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఆర్థిక సంవత్సరం 2024-25 వడ్డీని సభ్యుల ఖాతాల్లో జమ చేయడం మొదలుపెట్టింది. అయితే, ప్రతి ఆర్థిక సంవత్సరం వడ్డీ ఆలస్యంగా జమ కావడం పన్ను చెల్లింపుదారులకు పెద్ద సమస్యగా మారింది. ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్)లో దీనిని ఎలా చూపించాలో వారికి అర్థం కాదు. దీంతో లేనిపోని తలనొప్పులతో ఖాతాదారులు ఇబ్బందిపడుతున్నారు. ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఈ విషయాలు తెలుసుకోండి..

EPF Tax: పీఎఫ్ వడ్డీతో పన్ను చిక్కులు.. నోటీసులు రాకుండా తప్పించుకోండిలా!
Epfo Interest Tax

Updated on: Jul 08, 2025 | 5:00 PM

వడ్డీ ఆలస్యంగా జమకావడం వల్ల కొన్నిసార్లు ఐటీఆర్, ఆదాయ పన్ను విభాగం ఫామ్ 26ఏఎస్ లేదా వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో సమాచారం సరిపోలదు. దీనితో నోటీసులు వచ్చే అవకాశం పెరుగుతుంది. పీఎఫ్ వడ్డీపై పన్ను ఎలా పడుతుంది, ఐటీఆర్‌లో దీనిని ఎలా చూపించాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.

అధిక కాంట్రిబ్యూషన్ పై పన్ను

ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలు దాటితే, ఆ అదనపు మొత్తానికి వచ్చే వడ్డీపై పన్ను పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పరిమితి రూ.5 లక్షలు.

ఖాతా పాన్ (PAN) తో అనుసంధానిస్తే, ఈ వడ్డీపై 10% టీడీఎస్ (TDS) వర్తిస్తుంది.

పాన్ అనుసంధానం లేకపోతే, ఈ రేటు 20% అవుతుంది.

అయితే, మొత్తం పన్ను విధించే వడ్డీ రూ.5,000 కన్నా తక్కువ ఉంటే, టీడీఎస్ తీసివేయరు.

ఐటీఆర్, ఏఐఎస్‌లో తేడాలు

ఈపీఎఫ్‌ఓ వడ్డీని సాధారణంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో, అంటే జూలై-ఆగస్టు నెలల కల్లా జమ చేస్తుంది. ఉదాహరణకు, 2024-25 ఆర్థిక సంవత్సరం వడ్డీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తుంది. దానిపై టీడీఎస్ కూడా ఆ సంవత్సరమే పడుతుంది.

పన్ను చెల్లింపుదారులు పాస్‌బుక్ ఎంట్రీ ఆధారంగా ఆ వడ్డీని గత సంవత్సరం ఆదాయంలో కలిపితే, తరువాతి సంవత్సరం ఐటీఆర్, ఏఐఎస్/26ఏఎస్‌లో తేడా రావచ్చు.

ఇలాంటి పరిస్థితిలో, పన్ను చెల్లింపుదారులు ఏఐఎస్‌లో ఒక ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చు. సంబంధిత టీడీఎస్ గత సంవత్సరం ఆదాయం ఆధారంగా పడింది, పన్ను ముందుగానే చెల్లించామని తెలపవచ్చు. అయితే, ఈపీఎఫ్‌ఓ టీడీఎస్ సమాచారం సరిచేయకపోతే, సిస్టమ్‌లో తప్పు సమాచారం అలాగే ఉంటుంది. పన్ను విభాగం మీకు నోటీసు పంపవచ్చు.

క్రెడిట్ అయినప్పుడే నమోదు చేయండి

పన్ను నిపుణులు ఈపీఎఫ్ వడ్డీని క్రిడిట్ ఆధారిత పద్ధతిలో నమోదు చేయమని సలహా ఇస్తారు. అంటే, ఏ సంవత్సరంలో ఆ వడ్డీ మీ ఖాతాలో నిజంగా జమ అవుతుంది, టీడీఎస్ తీసివేస్తారో, ఆ సంవత్సరమే దానిని ఆదాయంగా చూపించాలి.

మీరు వడ్డీని ‘ఆర్జన’ (Accrual) ఆధారంగా గత సంవత్సరం ఆదాయంలో చూపించినా, ఈపీఎఫ్‌ఓ దానిని తరువాతి సంవత్సరం ‘క్రెడిట్’ చేసి, ఆ సంవత్సరమే టీడీఎస్ తీసివేస్తే, సమస్య వస్తుంది. అప్పుడు ఆదాయ పన్ను విభాగం సిస్టమ్‌లో మీ ఆదాయం, 26ఏఎస్/ఏఐఎస్ రికార్డుల్లో వ్యత్యాసం కనిపిస్తుంది. దీనితో మీకు పన్ను నోటీసు రావచ్చు.

పాలసీలో స్పష్టత అవసరం

ఈ గందరగోళానికి ఈపీఎఫ్‌ఓ వడ్డీ జమ ప్రక్రియ మూల కారణం అని నిపుణులు భావిస్తారు. ఈపీఎఫ్‌ఓ ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వడ్డీ రేట్ల ప్రకటన, ఆమోదం, జమ చేసే ప్రక్రియను పూర్తి చేయాలి. దీని వల్ల పన్ను చెల్లింపుదారులకు నివేదనలో పారదర్శకత ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఈపీఎఫ్‌ఓ విధానం పన్ను నిబంధనలను సంక్లిష్టం చేస్తుంది. తెలియకుండా తప్పుగా నివేదించే ప్రమాదాన్ని పెంచుతుంది.