లోన్ యాప్‌లు పుట్టుగొడుల్లా పుట్టుకొస్తున్నాయి. దీంతో సామాన్యులు, తక్కువ మొత్తంలో డబ్బు అవసరం ఉన్నవాళ్లు ఈ లోన్ యాప్‌ల్లో అప్పు తీసుకుంటున్నారు. తర్వాత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే ఏకంగా ప్రాణాలే తీసుకుంటున్నారు. కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసిన కొత్తగా వచ్చే యాప్‌లు మాత్రం ఆగడం లేదు. కొన్ని లోన్ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినా మరో పేరుతో లోన్ యాప్‌ను తీసుకొస్తున్నారు. అయితే ఆర్బీఐ ఈ లోన్ యాప్‌లను సీరియస్‌గా తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే రంగంలేకి దిగిన ఈడీ సుమారు 100 ఫిన్‌టెక్ సంస్థల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు సమాచారం. 15 రోజుల క్రితం.. ED హైదరాబాద్ చెల్లింపు గేట్‌వేలు, బ్యాంకులకు ఈ కంపెనీల జాబితాను పంపినట్లు తెలుస్తుంది. ఇందులో 100 ఫిన్‌టెక్ సంస్థల ఖాతాలను స్తంభింపజేయాలని సూచించింది.
ED చర్య తీసుకుంటున్న స్టార్టప్‌లలో Pagarbook, Propeld, Progcap, Kredily, Pocketly, Krazybee వంటివి కూడా ఉన్నాయి. ఈ ఫిన్‌టెక్ కంపెనీల వ్యవస్థాపకులను కూడా ఈడీ ఇప్పటికే విచారణకు పిలిపించింది. ఫిన్ టెక్ కంపెనీలు చైనీస్ డబ్బును అప్పుగా ఇస్తున్నాయా, వారికి ఏదైనా చైనీస్ కనెక్షన్లు ఉన్నాయా అనే విషయాలను తెలుసుకునేందుకు ఈడీ అధికారులు విస్తృతంగా విచారణ జరుపుతున్నారు.