
హెల్త్ ఇన్యూరెన్స్. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీఒక్కరికి తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన అవసరముంది. ఎందుకంటే వైద్య ఖర్చులు నానాటికి పెరిగిపోతున్నాయి. హాస్పిటల్‌లో కాలు అడుగుపెడితే రూ.వేలు, రూ.లక్షల్లో ఖర్చవుతుంది. దీంతో హాస్పిటల్ వైపు వెళ్లాలంటేనే జనం భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఏదైనా తీవ్రమైన అనారోగ్యానికి గురై సర్జరీలు చేయించుకోవాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇలాంటి సమయంలో అప్పులు తెచ్చి మరి హాస్పిటల్ బిల్లులు కడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో మీరు ఆర్ధికంగా నష్టపోకుండా హెల్త్ ఇన్యూరెన్స్ అనేది కాపాడుతుంది. అయితే చిన్న చిన్న వ్యాధులకు కూడా హెల్త్ ఇన్యూరెన్స్ వర్తిస్తుందా..? లేదా? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
జ్వరం, జలుబు లాంటి చిన్న వ్యాధుల బారిన పడినప్పుడు హాస్పిటల్‌లో చేరే అవకాశం ఉండదు. కేవలం డాక్టర్‌ను కలిసి మందులు తీసుకుని వెళుతుంటాం. ఇలాంటి వాటికి హెల్త్ ఇన్యూరెన్స్ వరిస్తుందా అంటే.. ఖచ్చితంగా వరిస్తుంది. కానీ మీరు అదనంగా ఓపీడీ ఆప్షన్ యాడ్ ఆన్‌లో ఎంచుకోవాలి. ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ అని అర్థం. జస్ట్ డాక్టర్‌ను కలిసి మెడిసిన్స్ తీసుకెళ్లడం, ప్రిస్క్రిప్షన్ మార్చుకోవడం లాంటివి ఈ విభాగం కిందకు వస్తాయి. ఇందుకు డాక్టర్‌కు ఫీజు రూపంలో కొంతమేర చెల్లించాల్సి ఉంటుంది. వీటికి కూడా హెల్త్ ఇన్యూరెన్స్ వర్తించాలంటే.. మీరు యాడ్ ఆన్‌లో ఓపీడీ కవరేజీ తీసుకోవాల్సింది. ఇందుకు కొంత ప్రీమియం పెరుగుతుంది. ఈ ఓపీడీ కవర్ మీరు తీసుకుంటే జ్వరం, జలుబు లాంటి చిన్న వ్యాధులు కూడా కవర్ అవుతాయి.
కొంతమంది షుగర్, బీపీ లాంటి దీర్థకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో తరచూ డాక్టర్లను సంప్రదించాల్సి ఉంటుది. ఇలాంటివారికి ఓపీడీ కవర్ వల్ల లాభం జరుగుతుంది. డాక్టర్ల ఫీజులు ఆదా అవుతాయి. కొన్ని రకాల డెంటల్ ట్రీట్‌మెంట్, ఫిజియోథెరపీ లాంటి చికిత్సలకు కూడా ఓపీడీ వర్తిస్తుంది. కానీ అప్పుడప్పుడు జ్వరం, జలుబు లాంటి చిన్న వ్యాధులతో హాస్పిటల్‌కు వెళ్లేవారికి ఓపీడీ కవరేజీ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఓపీడీ కవరేజీకి అదనంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఓపీడీ కవర్ తీసుకునే సమయంలో పాలసీ డాక్యుమెంట్‌లో నిబంధనల గురించి తెలుసుకోండి. ఓపీడీ కవర్ రూ.10 వేలు ఉన్నా.. డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు ఒక్కసారికి రూ.500 అనే నిబంధన పెడతారు. ఇక ఆయుర్వేదం, హోమియోపతి, యునాని వంటి ఆయుష్ చికిత్సలకు కూడా హెల్త్ ఇన్యూరెన్స్ వర్తిస్తుంది.