పర్సనల్ లోన్, హోమ్ లోన్.. ఇలా ఏ రుణం తీసుకోవాలన్నా బ్యాంకులు కచ్చితంగా చూసేది సిబిల్ స్కోర్. మంచి సిబిల్ స్కోర్ ఉంటే బ్యాంకులు ఎలాంటి కండిషన్స్ లేకుండా రుణాలు అందిస్తాయి. సిబిల్ స్కోర్ బాగా లేకపోతే బ్యాంకులు లోన్స్‌ను రిజక్ట్ చేస్తాయని తెలిసిందే. ఒక్కసారి డీఫాల్ట్ లోన్‌గా మారితే ఇకపై రుణం రావడం అంత సులభమైన విషయం కాదని తెలిసిందే. అందుకే సిబిల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని బిజినెస్ నిపుణులు చెబుతుంటారు.
కేవలం రుణం ఇవ్వాలా, వద్దా అనే విషయమే కాకుండా ఎంత వడ్డీకి రుణం ఇవ్వాలన్నది కూడా సిబిల్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుందని తెలిసిందే. సిబిల్ స్కోర్‌పై చాలా అంశాలు ప్రభావితం చూపుతాయి. అయితే మనం తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు మన సిబిల్‌పై ప్రభావం చూపుతాయి. సిబిల్ స్కోర్ తగ్గడానికి ప్రధాన కారణాలు కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా క్రెడిట్ కార్డులను ఉపయోగించే క్రమంలో చేసే కొన్ని తప్పుల కారణంగా సిబిల్ స్కోర్ తగ్గుతుంది. ఇందులో ప్రధానమైంది మనలో చాలా మంది క్రెడిట్ లిమిట్‌ను పూర్తిగా ఉపయోగిస్తుంటారు. అయితే సాధారణంగా క్రెడిట్ కార్డు వినియోగం పెరిగితే సిబిల్ స్కోర్ పెరుగుతుంది. కానీ ప్రతీసారి మ్యాగ్జిమమ్ లిమిట్‌ను ఉపయోగిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం క్రెడిట్ కార్డు లిమిట్‌లో 40 శాతానికి మంచి వాడకూడదని చెబుతుంటారు.
అలాగే క్రెడిట్ కార్డు బిల్ రీపేమెంట్ విషయంలో కూడా తప్పులు చేయకూడదు. ఒక్క రోజు ఆలస్యంగా బిల్ పే చేస్తే ఏం జరుగుతుందిలే అనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే బిల్ పేమెంట్ ఆలస్యమైతే ఆ ప్రభావం వెంటనే సిబిల్ స్కోర్‌పై పడుతుందని గుర్తుంచుకోవాలి. ఇక క్రెడిట్ బిల్ పేమెంట్ చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో మినిమం బ్యాలెన్స్‌ను పే చేసి మిగతా మొత్తాన్ని అలాగే వదిలేయకూడదు. ఇది కూడా సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడేలా చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు గడువులోపు మొత్తం పేమెంట్ చేయాలి.
ఇక మీరు రుణం కోసం ప్రయత్నించిన ప్రతీసారి మీ సిబిల్ స్కోర్‌పై ఎఫెక్ట్ పడుతుందని గుర్తుంచుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువసార్లు రుణం కోసం ఎంక్వైరీ చేసినా, ఎక్కువ బ్యాంకుల్లో లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసినా సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడుతుందని అంటున్నారు. అందుకే ఒక్కసారి లోన్ రిజక్ట్ అయితే కొంతకాలం వేచి ఉండడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..