
పెళ్లిళ్లు, తీర్థయాత్రలు లేదా విహార యాత్రలు వంటి శుభకార్యాల కోసం బస్సులను అద్దెకు తీసుకోవడం సర్వసాధారణం. అయితే ఎక్కువ మంది ప్రయాణికులు, ఎక్కువ దూరం వెళ్లాల్సి ఉన్నప్పుడు, బస్సుల కంటే ట్రైన్ బెస్ట్ ఛాయిస్. టికెట్స్ బుక్ చేసుకుంటే సీట్లు ఎక్కడెక్కడ వస్తాయో అనే టెన్షన్ మీకు అవసరం లేదు. ఎందుకంటే మీకు అవసరమైతే బోగీ లేదా మొత్తం రైలునే బుక్ చేసుకోవచ్చు. ఈ విషయం చాలామందికి తెలియదు. రైల్వే ఈ సదుపాయాన్ని తక్కువ బడ్జెట్‌తో అందుబాటులో ఉంచింది.
ఐఆర్‌సీటీసీ ఎఫ్‌టీఆర్ సేవ ద్వారా మీరు ఒకటి రెండు బోగీలను లేదా మొత్తం రైలును కూడా బుక్ చేసుకోవచ్చు. ఒక బోగీకి సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.50,000 చెల్లించాలి. మీరు రెండు బోగీలు బుక్ చేసుకుంటే రూ.లక్ష డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మొత్తం రైలును బుక్ చేసుకోవాలని అనుకుంటే.. కనిష్ఠంగా 18 నుంచి గరిష్ఠంగా 24 బోగీలను బుక్ చేసుకోవాలి. అయితే కనీసం 18 బోగీలకు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.9 లక్షలు చెల్లించాలి. మీకు 10 లేదా 12 బోగీలు అవసరం అయినప్పటికీ 18బోగీల సెక్యూరిటీ డిపాజిట్ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణ దూరం, ఎంపిక చేసుకున్న బోగీల సంఖ్య ఆధారంగా రైల్వే అధికారులు ప్రయాణ ఖర్చును నిర్ణయిస్తారు. ప్రయాణం పూర్తయిన తర్వాత చెల్లించిన మొత్తం నుండి ప్రయాణ ఖర్చును మినహాయించి మిగిలిన సెక్యూరిటీ డిపాజిట్‌ను పది రోజుల్లోపు తిరిగి ఇస్తారు.
రైలు లేదా బోగీని బుక్ చేసుకోవడానికి గూగుల్‌లో FTR IRCTC అని వెతికితే అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.
ఈ సదుపాయం ఎక్కువ మంది ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పెళ్లిళ్లు లేదా ఇతర శుభకార్యాలకు బంధువులు కలిసి వెళ్లడానికి, కుటుంబ సభ్యులు, స్నేహితులతో విహార యాత్రలకు వెళ్లడానికి, పెద్ద బహిరంగ సభలకు వెళ్లే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ సాధారణంగా ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అత్యవసర పరిస్థితుల్లో రైల్వే బోర్డు అనుమతితో ఆఫ్‌లైన్ ద్వారా కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..