ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. ఒకచేత్తో సంపాదిస్తే జీవించలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెండు చేతులా సంపాదించేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు కూడా వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వ్యాపారం అనగానే వెంటనే పెట్టుబడి అనే భయం ఉంటుంది.
అయితే మన దగ్గరున్న వనరులను సరిగ్గా వినియోగించుకుంటే తక్కువ పెట్టుబడితోనే వ్యాపారం మొదలు పెట్టొచ్చు. సాధారణంగా ఏదైనా వ్యాపారం అనగానే స్థలం కోసం వెతుకుతుంటారు. అయితే ఇంటి మేడపై ఖాళీ స్థలం ఉంటే చాలు వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది. బిల్డింగ్‌పై ఉండే ఖాళీ ప్రదేశాన్ని సరిగ్గా వినియోగించుకుంటే మంచి ఆదాయం పొందొచ్చు. ఇంతకీ బిల్డింగ్‌పై ఉన్న ఖాళీ ప్రదేశంలో ఎలాంటి వ్యాపారాలు చేయొచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం..
* మేడపై ఖాళీ స్థలం ఉన్న వారు మొక్కలు పెంచుకోవచ్చు. టమాటలు, వంకాయలు, పచ్చిమిర్చి వంటి మొక్కలను పెంచుకోవచ్చు. అయితే వీటి ద్వారా తక్కువ ఆదాయం వస్తుందనుకునే వారు.. టెర్రస్ మీద డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను పెంచి మంచి ఫలితాలు పొందొచ్చు. కొందరు ఔత్సాహికులు ఇప్పటికే ఇలాంటి మొక్కలను పెంచుతున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి.
* ఇక ఇటీవల మేడపై చేపలను పెంచుతోన్న వారి సంఖ్య సైతం పెరుగుతోంది. ముఖ్యంగా మహిళా సంఘాలకు చెందిన వారు రుణాలు తీసుకొని ఇలాంటి వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. కామారెడ్డికి చెందిన కొందరు మహిళలు ఇటీవల చేపల పెంపకాన్ని ప్రారంభించి మంచి లాభాలను పొందుతున్నారు. ప్రభుత్వాలు సైతం ఇందుకు సహకరించి రుణాలు అందిస్తున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్‌లో ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు.
* ఇక కేవలం చేపలు మాత్రమే కాకుండా కోళ్లను కూడా పెంచుకోవచ్చు. కాస్త స్థలం ఎక్కువ ఉంటే కడక్ నాథ్ లాంటి కోళ్లను తక్కువ సంఖ్యలో పెంచుకున్న మంచి లాభాలను ఆర్జించవచ్చు.
* టెర్రస్ మీద పుట్ట గొడుగులను పెంచుతూ కూడా లాభాలు ఆర్జిస్తున్న వారు ఉన్నారు. మేడపై చిన్న షెడ్డులాంటిది వేసుకొని పుట్ట గొడుగుల పెంపకాన్ని చేపట్టవచ్చు. ప్రస్తుతం పుట్ట గొడుగులకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో దీనిని మంచి ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు.
* ఒకవేళ మీ ఇల్లు నగర శివారులో ఉంటే మేడపై తేనెటీగలను కూడా పెంచుకోవచచు. అయితే తేనె టీగల పెంపకం కోసం నైపుణ్యం ఉండాలి. ఇందుకోసం కొన్ని సంస్థలు శిక్షణ సైతం అందిస్తున్నాయి. ఒకవేళ మీ ఇంటి చుట్టుపక్కల చెట్లు ఎక్కువగా ఉంటే తేనె వ్యాపారం లాభిస్తుంది.
* ఇంటి మేడపై సెల్ ఫోన్ టవర్‌ల ఏర్పాటుతో కూడా మంచి ఆదాయాన్ని పొందొచ్చు. ఎలాంటి పెట్టుబడి లేకుండా కేవలం మీ స్థలాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారానే ఆదాయాన్ని పొందొచ్చు. ఇందుకోసం టెలికం సంస్థలను సంప్రదించాల్సి ఉంటుంది.
* ఒక ఒకవేళ మీ ఇల్లు మెయిన్ రోడ్డుపై ఉంటే టెర్రస్ రెస్టరెంట్‌లను సైతం ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ఇలాంటి రెస్టరంట్‌లకు డిమాండ్ పెరుగుతోంది. యువత ఇలాంటి రెస్టారెంట్స్‌లో భోజనం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి మేడపై ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే ఇలాంటి బిజినెస్ ఐడియా బాగా వర్కవుట్ అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..