Home Loan: ఒక హోమ్ లోన్ ఉండగా.. మరో హోమ్ లోన్ తీసుకోవచ్చా..? తప్పక తెలుసుకోండి..

ప్రస్తుత కాలంలో ఇల్లు అనేది పెద్ద సవాల్‌గా మారింది. రెక్కలు ముక్కలు చేసుకున్న సొంతింటి కోసం డబ్బులు సరిపోని పరిస్థితులు ఉన్నాయి. దీంతో చాలా మంది హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కడుతున్నారు. అయితే ఒక హోమ్ లోన్ ఉన్నాక.. మరో హోమ్ లోన్ తీసుకోవచ్చా అనేది తెలుసుకుందాం..

Home Loan: ఒక హోమ్ లోన్ ఉండగా.. మరో హోమ్ లోన్ తీసుకోవచ్చా..? తప్పక తెలుసుకోండి..
How To Get Second Home Loan

Updated on: Sep 04, 2025 | 5:00 PM

ప్రతి ఒక్కరి జీవితంలో సొంత ఇల్లు అనేది పెద్ద కల. కానీ నేటి కాలంలో ఆకాశాన్నంటుతున్న ధరల కారణంగా హోమ్ లోన్ తీసుకోక తప్పడం లేదు. అయితే కొంతమందికి ఒక హోమ్ లోన్ ఉన్నప్పటికీ, మరొక ఇల్లు కొనుగోలు చేయాలనే ఆలోచన రావచ్చు. అలాంటి సందర్భాలలో రెండో హోమ్ లోన్ తీసుకోవచ్చా? అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. ఆ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

నిజానికి మీరు ఇప్పటికే ఒక హోమ్ లోన్ తీసుకున్నప్పటికీ.. మరొక హోమ్ లోన్ తీసుకోవడం సాధ్యమే. అయితే దీనికి బ్యాంకులు కొన్ని కఠినమైన నిబంధనలు, షరతులను పాటిస్తాయి. మీరు రెండో హోమ్ లోన్ పొందగలరా లేదా అనేది మీ ఆర్థిక పరిస్థితి, ఆదాయం, క్రెడిట్ స్కోరు, ఇప్పటికే ఉన్న రుణ భారం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

రెండో హోమ్ లోన్ కోసం ఇవి తప్పనిసరి..

రెండో హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు బ్యాంకులు ప్రధానంగా ఈ కింది విషయాలను పరిశీలిస్తాయి:

రుణం-ఆదాయ నిష్పత్తి : మీ నెలవారీ ఆదాయంలో మీరు ఈఎంఐల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు అనేది చాలా ముఖ్యం. బ్యాంకులు మీ మొత్తం రుణాల ఈఎంఐలు, నెలవారీ ఆదాయంలో 40-50శాతం కంటే తక్కువగా ఉండాలని అంటాయి. మీ ఆదాయం ఎక్కువగా ఉండి, ఇప్పటికే ఉన్న ఈఎంఐలు తక్కువగా ఉంటే మీకు కొత్త లోన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

క్రెడిట్ స్కోరు: మీరు ఎంత నమ్మకమైన రుణగ్రహీత అనేది మీ క్రెడిట్ స్కోరు చెబుతుంది. సాధారణంగా 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్నవారికి రెండో హోమ్ లోన్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోరు అంటే మీరు గతంలో అప్పులను సకాలంలో చెల్లించారని బ్యాంకులు నమ్ముతాయి.

క్రెడిట్ హిస్టరీ : మీరు మీ మొదటి హోమ్ లోన్ ఈఎంఐలను సకాలంలో క్రమం తప్పకుండా చెల్లిస్తుంటే.. అది మీ ఆర్థిక క్రమశిక్షణను సూచిస్తుంది. బ్యాంకులు మీ గత రుణ చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించి, మీరు కొత్త రుణాన్ని కూడా సకాలంలో చెల్లించగలరని నిర్ధారించుకుంటాయి.

ఆస్తి విలువ : రెండో లోన్ కోసం మీరు కొనుగోలు చేయబోయే ఇంటి మార్కెట్ విలువ కూడా కీలకం. బ్యాంకులు సాధారణంగా ఆస్తి విలువలో 75శాతం నుండి 90శాతం వరకు రుణంగా ఇస్తాయి. మిగిలిన మొత్తాన్ని మీరు డౌన్ పేమెంట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

రుణ ఉద్దేశ్యం: మీరు రెండో లోన్ ఎందుకు తీసుకుంటున్నారు అనేది కూడా బ్యాంకులు పరిశీలిస్తాయి. మీరు నివాసం కోసం తీసుకుంటున్నారా లేక పెట్టుబడి కోసం తీసుకుంటున్నారా అనేది బట్టి రుణ నిబంధనలు మారవచ్చు. పెట్టుబడి గృహాల కోసం నిబంధనలు కాస్త కఠినంగా ఉండవచ్చు.

మొత్తంగా మీకు ఇప్పటికే ఒక హోమ్ లోన్ ఉన్నప్పటికీ, ఆర్థికంగా స్థిరంగా, మంచి క్రెడిట్ స్కోరుతో ఉన్నట్లయితే రెండో హోమ్ లోన్ పొందడం సుసాధ్యమే. సరైన ప్రణాళికతో, బ్యాంకుల నిబంధనలను పాటించడం ద్వారా మీరు మీ మరో కలను సాకారం చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..