Petrol, Diesel: వచ్చే నెలలో భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..! వంట నూనెలది అదే దారి..!
కొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇందుకు కారణం అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలే...
కొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్(Petrol, Diesel) ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇందుకు కారణం అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు(crud oil) ధరలే. ఇప్పుడే పెంచేందుకు అయిల్ కంపెనీలు సిద్ధంగా ఉన్నా.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల(five states assembly elections) దృష్ట్యా ధరల పెంపును వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఎన్నికలు పూర్తి కాగానే ధరలు పెంచే అవకాశం ఉందని డెలాయిట్ నివేదిక పేర్కొంది. వచ్చే నెలలో ఇంధన ధరల మోత మోగించే యోచనలో కంపెనీలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. మార్చి 10 వరకు విక్రయ ధరలో ఎంతైతే లోటును భరించాయో, ఆ మొత్తం వసూలు చేసుకునేలా ధరలు పెంచే అవకాశం ఉందని తెలిపారు. లీటరుకు రూ.8-9 వరకు పెరగొచ్చని వివరించారు.
అంతర్జాతీయ ముడిచమురు ధరలకు అనుగుణంగా ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంస్థలు (ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్) దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేలా సాంకేతికంగా అనుసంధానమయ్యాయి. అయితే అధిక ధరల వల్ల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో, అధికారంలోని పార్టీల అవసరాలకు అనుగుణంగా ఎన్నికల సమయాల్లో చమురు సంస్థలు ధరలను పెంచడం లేదనే విమర్శ దేశీయంగా ఉందని డెలాయిట్ ప్రతినిధి చెప్పారు.
అయితే చమురు ధర పెరిగితే కరెంటు ఖాతా లోటు పెరగడమే కాకుండా నిత్యావసరాల ధరలు పెరుగుదలతోపాటు ద్రవ్యోల్బణ నియంత్రణలో ఆర్‌బీఐకి సవాళ్లు ఎదురవుతాయి. కరోనా పరిణామాల నేపథ్యంలో, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కీలక రేట్లను ఆర్‌బీఐ పరిమిత స్థాయిలో ఉంచుతోంది. ద్రవ్యోల్బణం పెరిగితే.. కీలక రేట్లు పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి భారత్ చేస్తున్న చర్యలపై ‘పెరుగుతున్న వంటనూనెల ధరలు’ ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పామాయిల్ ధర ఈ ఏడాది 15 శాతం, సోయాబీన్ నూనె 12 శాతం పెరిగాయి.
దీంతో అంతర్జాతీయ ఆహార ద్రవ్యోల్బణాన్ని ఆల్‌టైం గరిష్ఠాల సమీపానికి చేరింది. పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు పువ్వు నూనెలను ఎక్కువగా కొనుగోలు చేసే భారత్‌పై ఈ ధరల పెరుగుదల ఒత్తిడి తీసుకొచ్చింది. వినియోగదారు ఆహార ధరలు 6 నెలల్లోనే ఎన్నడూ లేనివిధంగా గత డిసెంబరులో పెరిగాయి. దీంతో 80 కోట్ల మందికి ఆహార మద్దతు ఇస్తున్న ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరిగింది. అందుకే పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు పువ్వు నూనెలపై దిగుమతి సుంకాలను సైతం తగ్గించారు. భారీమొత్తం నిల్వలను అట్టేపెట్టి ఉంచకుండా పరిమితులు కూడా విధించారు.
వంట నూనెల విషయంలో సత్వర పరిష్కారం ఏమిటంటే పొద్దుతిరుగుడు రిఫైన్డ్ నూనెను ప్రభుత్వమే దిగుమతి చేసుకుని ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువకు అమ్మితే కొంత ఉపశమనం లభించోచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దేశీయంగా నూనె గింజల సాగు పెంచుకోవాలని సూచిస్తున్నారు. ధరల అదుపునకు చైనా ఇలాంటి వ్యూహాన్ని అనుసరిస్తోంది. వ్యూహాత్మక లోహాలు, వ్యవసాయ దిగుబడులను నిల్వ చేస్తుంది. నిల్వల పరిమాణాలను బయటపెట్టదు. అత్యవసర సమయాల్లో వాటిని విడుదల చేసి ధరలను అదుపు చేస్తుంది.
Read Also.. Tesla Rrecalls: వాహనదారుల మెడకు చుట్టుకుంటున్న టెక్నికల్ ఎర్రర్.. వేలాది వాహనాలు వెనక్కి