
ముడి చమురు ధరలు భారీగా పడిపోతున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్దం క్రమంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. బ్యారెల్ ధర ఏకంగా 150 డాలర్లకు మించి చేరుకుంది. అయితే అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం చోటుచేసుకోవడం, హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఇప్పుడు బ్యారెల్ ధర ఏకంగా 70 డాలర్ల కంటే దిగువకు చేరుకుంది. భారత్ ఎక్కువగా విదేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం గత నెలలో పెంచింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.7.5 శాతం మేర పెంచింది. ఇది సామాన్యులపై పెద్ద భారంగా చెప్పవచ్చు.
అయితే ప్రస్తుతం ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం వల్ల చమురు కంపెనీలపై కూడా ఒత్తిడి తగ్గింది. దీంతో చమురు కంపెనీలు నష్టాల నుంచి కొలుకుంటున్నాయి. భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 68.86 డాలర్లకు చేరుకుంది. యుద్దం తర్వాత ధరలు 70 డాలర్ల కంటే దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 23న బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 157 డాలర్లకు చేరుకుని ఆల్ టైం రికార్డ్ నమోదు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు 56 శాతం కంటే ఎక్కువ తగ్గాయి. దీంతో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు పెద్ద ఊరట కలిగింది.
క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్ పై రూ. 5 నుంచి రూ.6 వరకు లాభం పొందుతున్నాయి. అయితే డీజిల్ పై మాత్రం రూ.8 నుంచి రూ.10 మేర నష్టాన్ని చవిచూస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలను ఒకేసారి తగ్గించేందుకు కంపెనీలు ముందడుగు వేయడం లేదు. ముడి చమురు ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో కేంద్రం ఇంధన ధరలను తగ్గించలేదు. దీంతో కంపెనీలపై ఈ భారం పడింది. ఇప్పుడు ఆ నష్టాల నుంచి బయటకు రావడానికి కొంత సమయం పట్టే అవకాశముంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశముంది. పరిస్ధితులు చక్కబడితే వచ్చే నెలలో ధరలు దిగొచ్చే అవకాశముంది.