
జనవరిలో ప్రధాన భారతీయ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ పోర్ట్‌ఫోలియోలను దూకుడుగా విస్తరించాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కొత్తగా జారీ చేసిన క్రెడిట్ కార్డుల్లో దాదాపు 90 శాతం ఆయా బ్యాంకులవే ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం తెలుస్తుంది. భారతదేశంలోని మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్యలో 9.5% వృద్ధికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డులు, ఐసీఐసీఐ బ్యాంక్‌లు దోహదపడ్డాయని నిపుణులు చెబుతున్నారు. జనవరిలో భారత్‌లో ఏకంగా 8.2 లక్షల కొత్త క్రెడిట్ కార్డులను అందించారు. వీటిలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 3 లక్షల కార్డులతో ముందంజలో ఉంది. ఎస్‌బీఐ 2.4 లక్షలు, ఐసీఐసీఐ బ్యాంక్ 1.8 లక్షలు కార్డులను అందించారు.
ప్రధాన బ్యాంకుల కార్డుల జారీలో పెరుగుదల ఉన్నప్పటికీ చిన్న సంస్థలు జాగ్రత్తగా ఉన్నాయి. కేవలం 1 లక్ష కొత్త క్రెడిట్ కార్డులను మాత్రమే జారీ చేశాయి. పెరుగుతున్న అపరాధ రుసుములతో పాటు ఆర్‌బీఐ నిబంధనలు నేపథ్యంలో చిన్న బ్యాంకులు క్రెడిట్ కార్డుల జారీను కఠినతరం చేశాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ బ్యాంకు మాత్రం తమ క్రెడిట్ కార్డుల చెల్లింపులు తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొంది. రాబోయే త్రైమాసికాల్లో మరిన్ని తగ్గింపులు ఉంటాయని అంచనా వేసింది. నవంబర్ 2023లో పెరిగిన వినియోగదారుల రుణాలకు ప్రతిస్పందనగా ఆర్‌బీఐ కఠినతర చర్యలను అమలు చేసింది. ఎన్‌బీఎఫ్‌సీ, మైక్రోఫైనాన్స్ రుణాలపై సడలింపులు ఇస్తూనే, సెంట్రల్ బ్యాంక్ అన్‌సెక్యూర్డ్ రుణాలపై అధిక రిస్క్ టాలరెన్స్‌ను కొనసాగించింది. ఆర్‌బీఐ డేటా కూడా జనవరి 2025లో క్రెడిట్ కార్డ్ ఖర్చులో 2.1 శాతం తగ్గుదలని వెల్లడించింది. మొత్తం వ్యయం డిసెంబర్ 2024లో రూ1.89 లక్షల కోట్ల నుంచి రూ.1.85 లక్షల కోట్లకు పడిపోయింది. డిసెంబర్‌లో ఖర్చులో 11.1 శాతం పెరుగుదల ఉన్నా వ్యయం మాత్రం పడిపోవడం గమనార్హం. అలాగే జనవరి 2025 ఖర్చు మునుపటి సంవత్సరం కంటే 10.6 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఇండస్ ఇండ్ బ్యాంకుల క్రెడిట్ కార్డుల ఖర్చులో తాత్కాలిక తగ్గుదల ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డులు తీసుకునే వారి సంఖ్య పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఖర్చులో 4.7 శాతం తగ్గుదల నమోదు చేయగా, యాక్సిస్ బ్యాంక్ 6.6 శాతం తగ్గుదల, ఇండస్ఇండ్ బ్యాంక్ 5.5 శాతం తగ్గుదల నమోదు చేసింది. అలాగే ఫిలిప్ క్యాపిటల్ నివేదిక ప్రకారం క్రెడిట్ కార్డ్ విభాగంలో మొత్తం క్రెడిట్ ఖర్చులు రాబోయే ఒకటి నుంచి రెండు త్రైమాసికాలలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయని అంచనా వేసింది. రిస్క్‌లను నియంత్రించడంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా అన్‌సెక్యూర్డ్ వ్యాపారాలపై రిస్క్ వెయిట్‌లను పెంచాలనే నియంత్రణ సంస్థ నిర్ణయం తర్వాత బ్యాంకులు ఇప్పటికే దిద్దుబాటు చర్యలు తీసుకున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి