Fake Currency: దేశంలో ఉవ్వెత్తున తిరిగొచ్చిన నకిలీ కరెన్సీ నోట్లు.. మనకే నష్టం.. డీమోనిటైజేషన్ తరువాత కూడా..

|

May 30, 2022 | 12:36 PM

Fake Currency: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా వార్షిక నివేదిక దేశంలో నకిలీ నోట్ల సమస్య మళ్లీ పుంజుకుందని తెలియజేసింది. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో నకిలీ నోట్లు 10.7 శాతం పెరిగాయి.

Fake Currency: దేశంలో ఉవ్వెత్తున తిరిగొచ్చిన నకిలీ కరెన్సీ నోట్లు.. మనకే నష్టం.. డీమోనిటైజేషన్ తరువాత కూడా..
Fake Notes
Follow us on

Fake Currency: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా వార్షిక నివేదిక దేశంలో నకిలీ నోట్ల సమస్య మళ్లీ పుంజుకుందని తెలియజేసింది. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో నకిలీ నోట్లు 10.7 శాతం పెరిగాయి. FY 22లో సెంట్రల్ బ్యాంక్ రూ. 500 డినామినేషన్ 101.9 శాతానికి పైగా నకిలీ నోట్లను గుర్తించగా.. రూ. 2,000 నకిలీ నోట్లు 54.16 శాతం పెరిగాయనే షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే కాలంలో రూ. 10, రూ. 20 నకిలీ నోట్లలో వరుసగా 16.4 శాతం, 16.5 శాతం పెరుగుదల కనిపించింది. నకిలీ రూ.200 నోట్లు ఏడాదికి 11.7 శాతం పెరిగాయి. రూ.50, రూ.100 డినామినేషన్లలో గుర్తించిన నకిలీ నోట్లు 28.7 శాతం, 16.7 శాతం తగ్గాయని నివేదిక వెల్లడించింది. వాటిలో 6.9 శాతం ఆర్‌బిఐ వద్ద కనుగొనగా.. మిగిలిన 93.1 శాతం దేశంలోని బ్యాంకులు గుర్తించాయి. అసలు నకిలీ నోట్లు లేకుండా చేసేందుకు చేసిన డీమోనిటైజేషన్ విఫలమైందనే చెప్పుకోవాలి.

నకిలీ నోట్ల రాకెట్, నల్లధనం, నగదు ఆధారిత అవినీతిపై అతిపెద్ద దాడిగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రవేశపెట్టిన ఆరేళ్ల తర్వాత కూడా భారత ఆర్థిక వ్యవస్థ నకిలీ నోట్ల తయారీదారుల పట్టులోనే కొనసాగుతోంది. డీమోనిటైజేషన్ తరువాత పరిస్థితుల్లో మార్పు పెద్దగా లేదని తెలుస్తోంది. నకిలీ నోట్ల మాఫియాలు తిరిగి మార్కెట్‌లోకి రావడానికి, చట్టపరమైన పరిశీలనను అధిగమించడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారని నివేదిక చెబుతోంది.

నకిలీ నోట్లు ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతాయి?

చలామణిలో ఉన్న నకిలీ నోట్లు నిజానికి ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయి. పెద్ద మొత్తంలో నకిలీ నోట్ల చెలామణి కృత్రిమంగా.. ఆర్థిక వ్యవస్థలో నగదు సర్కులేషన్ ను పెంచుతుంది. దీని వలన వస్తుసేవలనకు డిమాండ్ పెరుగుతుంది. ఇలా డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరిగి.. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. నకిలీ నోట్లు చెలామణిలో ఉన్న కరెన్సీపై బ్యాంకింగ్ రెగ్యులేటర్, ప్రభుత్వ ఏజెన్సీల అంచనాలను కూడా తలకిందులు చేస్తాయి. ఇవి ఆర్థిక వ్యవస్థలో అక్రమ లావాదేవీలు జరిగేందుకు కూడా కేంద్ర బిందువుగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీటికి తోడు మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ప్రభుత్వ సంస్థలు స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీ నోట్ల పరిమాణం ఆధారంగా మాత్రమే నకిలీ కరెన్సీ పెరుగుదల నివేదించబడింది. అంటే ప్రభుత్వ ఏజెన్సీలు గుర్తించని లేదా వారి దృష్టిలోకి రాని ఫేక్ కరెన్సీ ప్రమాదం ఆర్థిక వ్యవస్థలో ఇంకా అలాగే కొనసాగుతుంది. వాస్తవ పరిస్థితులను చూస్తుంటే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏజన్సీలు మరింత అప్రమత్తత పెంచాల్సిన సమయం ఆసన్నమేందని చెప్పుకోవాలి. ప్రజలు కూడా వీటితో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.