Cryptocurrency: క్రిప్టోకరెన్సీలపై సంప్రదింపుల పత్రాన్ని రూపకల్పన జరిగింది. దీనిని త్వరలోనే కేంద్రానికి అందజేస్తామని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ సోమవారం తెలిపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా.. సేథ్ మాట్లాడుతూ, క్రిప్టోకరెన్సీ సమస్య గురించి దేశీయ, ఇతర వాటాదారులతో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. చర్చల ఆధారంగా సంప్రదింపు పత్రాన్ని తయారు చేసినట్లు వెల్లడించారు. క్రిప్టోకరెన్సీల ద్వారా ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడానికి ప్రపంచవ్యాప్తంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ క్రిప్టోకరెన్సీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించిందని అన్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకు విధానపరమైన స్పష్టత లేదు. దీనిపై సంప్రదింపుల పత్రాన్ని సిద్ధం చేయడం ఆ దిశగా వేస్తున్న ఒక అడుగుగా అందరూ భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థపై సేథ్ మాట్లాడుతూ.. సవాలుతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ, భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని అన్నారు.
క్రిప్టోకరెన్సీలపై ప్రపంచ ఏకాభిప్రాయం చాలా ముఖ్యమైనదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అన్నారు. కానీ దేశీయ పెట్టుబడిదారులను రక్షించడానికి క్రిప్టోకరెన్సీలను నియంత్రించే ముందు ఇతర దేశాలు తీసుకున్న చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయంలో తాము విస్తృతంగా చర్చలు జరిపామని.. దేశీయ వాటాదారుల నుంచి మాత్రమే కాకుండా IMF, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల నుంచి కూడా సూచనలు తీసుకున్నట్లు సేథ్ వెల్లడించారు.
వర్చువల్ డిజిటల్ ఆస్తుల లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది . దీనితో పాటు.. వర్చువల్ డిజిటల్ ఆస్తుల లావాదేవీలపై 1 శాతం TDS విధించాలని కూడా బడ్జెట్‌లో ప్రకటించటం జరిగింది.