
దేశంలో చాలా మంది పదవీ విరమణ తర్వాత సౌకర్యంగా జీవించడానికి ముందు నుంచే పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. వ్యక్తులు తక్కువ రిస్క్ ఉన్న పథకాల్లో పెట్టుబడి పెట్టి వారి పదవీ విరమణ అవసరాలను తీర్చడానికి స్థిర వడ్డీ ఆదాయంపై ఆధారపడతారు. ప్రస్తుతం అన్ని చిన్న పొదుపు పథకాలో ఎస్‌సీఎస్ఎస్ సంవత్సరానికి అత్యధిక వడ్డీ రేటు 8.20% అందిస్తోంది. ఈ వడ్డీని త్రైమాసికానికి ఒకసారి ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరి నెలల మొదటి పని దినాన నేరుగా పొదుపు ఖాతాలో జమ చేస్తారు. దీని వల్ల సీనియర్ సిటిజన్లు సౌకర్యంగా జీవించవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్లకు ఎస్‌సీఎస్ఎస్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ మొత్తం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 కంటే ఎక్కువగా ఉంటే ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 194ఏప్రకారం మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్) చేస్తారు. రూ.50,000 కంటే తక్కువ వడ్డీ సంపాదించే డిపాజిటర్లు/ఖాతాదారులు (సీనియర్ సిటిజన్లు) పైన పేర్కొన్న పరిమితి కంటే తక్కువ వడ్డీ పొందితే నివారించడానికి ఫారమ్ 15 జీ లేదా 15హెచ్ (సందర్భాన్ని బట్టి) బ్యాంకు/పోస్ట్ ఆఫీస్‌కు సమర్పించవచ్చు.
ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో పాటు పన్ను ప్రయోజనం కాకుండా ఎస్‌సీఎస్ఎస్ ఖాతాదారులకు ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ కాలానికి ముందు ఎప్పుడైనా ముందస్తుగా మూసివేసి ఉపసంహరించుకునే అవకాశాన్ని అందిస్తుంది. అయితే ఎస్‌సీఎస్ఎస్ ఖాతా నుంచి బహుళ ఉపసంహరణలు అనుమతించరు. ముందస్తుగా మూసివేయడానికి, ఉపసంహరించుకోవడానికి ఫారం-2ను పూరించి ఆధార్, పాన్, ఎస్‌సీఎస్ఎస్ పాస్‌బుక్ మొదలైన వాటితో మీరు ఖాతాను కలిగి ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసుకు సమర్పించవచ్చు. అయితే ఎస్‌సీఎస్ఎస్ ఖాతాను ముందస్తుగా మూసివేసి, ఉపసంహరించుకునేటప్పుడు, జరిమానాకు సంబంధించిన షరతులను మీరు గుర్తుంచుకోవాలి.
ఎస్‌సీఎస్ఎస్ మీకు ముందస్తుగా మూసివేయడానికి, ఉపసంహరించుకోవడానికి వెసులుబాటును కల్పిస్తున్నప్పటికీ మీ ఆర్థిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ సదుపాయాన్ని వివేకవంతంగా ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి