KCR Directions : ‘వరి నాటులో వెదజల్లే పద్దతిని ప్రోత్సహించాలె..’ వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

|

May 29, 2021 | 11:48 PM

నారు పోసే పని లేదు . నారు పీకే పని లేదు. నాటు పెట్టే పని లేదు. కూలీల కోసం గొడవ లేదు. కలుపు కూలీల ఇబ్బంది లేదు. నీటి వినియోగం 30- 35 శాతం తగ్గుతుంది. 10-15 రోజుల ముందు క్రాప్ వస్తుంది..

KCR Directions : వరి నాటులో వెదజల్లే పద్దతిని ప్రోత్సహించాలె..  వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
Kcr On Scattering Method In
Follow us on

Scattering method in paddy  : వరి నాటులో వెదజల్లే పద్ధతి ద్వారా వరి పంట సాగు చేస్తే.. రెండు పంటలకు కలిపి కోటి ఎకరాలు సాగు చేసే తెలంగాణ రైతులకు సుమారు రూ.10 వేల కోట్లపైనే పెట్టుబడి మిగులుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలిపారు. ఈ పద్ధతిలో వరి పంట సాగు చేస్తే ఎకరానికి 2-3 బస్తాలు (1-2 క్వింటాళ్లు) దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ శాఖపై శనివారం ప్రగతి భవన్ లో జరిపిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో వరి నాటులో ధాన్యం వెదజల్లే పద్ధతి గురించి సీఎం ప్రత్యేకంగా చర్చించారు. ఈ పద్దతిలో వరి సాగు చేసే అంశంపై తెలంగాణ రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులను సీఎం ఆదేశిచారు. ఈ వరి ధాన్యం విత్తనాలను వెదజల్లే పద్ధతి ద్వారా బురదలో కాలు పెట్టకుండానే వరి పంట నాటుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ …

” నారు పోసే పని లేదు . నారు పీకే పని లేదు. నాటు పెట్టే పని లేదు. కూలీల కోసం గొడవ లేదు. కలుపు కూలీల ఇబ్బంది లేదు. నీటి వినియోగం 30- 35 శాతం తగ్గుతుంది. 10-15 రోజుల ముందు క్రాప్ వస్తుంది. మామూలు పద్ధతిలో అయితే ఎకరానికి 25 కిలోల విత్తనాలు కావాలి. ఈ వెదజల్లే పద్ధతి అయితే 8 కిలోల విత్తనపొడ్లు సరిపోతయి. వడ్లు సల్లినంక ఎన్ని రోజులకైనా నీళ్లు కట్టుకోవచ్చు. విత్తనపొడ్లు వెదజల్లినంక వర్షం పడే దాక కొన్నిరోజులు ఎదురు చూస్తే ఇంకా మంచిది. కాళేశ్వరం సహా అన్ని సాగు నీటి ప్రాజెక్టులు, లిఫ్టులు, సుమారు 30 లక్షల బోరుబావుల పరిధిలో వరి సాగు చేసే రైతులకు ఈ వరి నాటులో వెదజల్లే పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. ఖమ్మం జిల్లాలో ఈ వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసే రైతులను పిలిచి ఈ విధానం గురించి స్టడీ చేశాను. నేను స్వయంగా రైతును కాబట్టి నా పొలంలో ఈ విధానంలో వరి సాగు చేసి మంచి ఫలితాలను పొందాను. ఈ పద్ధతిలో విత్తనపొడ్లు సల్లడానికి యంత్ర పరికరాలు కూడా అందుబాటులో ఉన్నయి. తెలంగాణలో వరి సాగు చేసే రైతులందరూ ఈ వెదజల్లే పద్దతిని అనుసరిస్తే మంచిది” అని సీఎం కేసీఆర్ వివరించారు.

Read also :  Tragedy : కరోనా తెచ్చిన కన్నీటి గాథలు : కన్నతల్లి చనిపోవడంతో బాధను వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య