Cigarette Price Hike: పొగరాయుళ్లకు పిడుగులాంటి వార్త.. ఇక ఊదడం ఆపేయండి బ్రో

ఫిబ్రవరి 1 నుండి సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. కేంద్రం కొత్త ఎక్సైజ్ సుంకం, ఆరోగ్య సెస్ విధించింది. ఆదాయాన్ని పెంచడం, పొగాకు వినియోగాన్ని తగ్గించడం లక్ష్యం. సిగరెట్ల పొడవు ఆధారంగా పన్నులు మారతాయి. MRP ఆధారిత ధరల విధానం, తయారీదారులకు CCTV కెమెరాలు వంటి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

Cigarette Price Hike: పొగరాయుళ్లకు పిడుగులాంటి వార్త.. ఇక ఊదడం ఆపేయండి బ్రో
Smoking

Updated on: Jan 31, 2026 | 6:10 PM

సిగరెట్ల ధరలు భారీ పెరగనున్న విషయం తెలిపిందే. ఆ పెంపు రేపటి నుంచి(ఫిబ్రవరి 1) అమలులోకి రానుంది. పొగాగు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని, పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్‌ను అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కొత్త పన్ను నిర్మాణం జూలై 2017లో GST అమలులోకి వచ్చినప్పటి నుండి ఈ వస్తువులుపై విధించబడిన ప్రస్తుత 28 శాతం GST, సెస్‌ను భర్తీ చేస్తుంది. ప్రభుత్వ లక్ష్యం ఆదాయాన్ని పెంచడమే కాకుండా పొగాకు వినియోగాన్ని తగ్గించేందుకు ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటివరకు సిగరెట్లు, పాన్ మసాలా వంటి ఉత్పత్తులు 28 శాతం GST, దాని పైన పరిహార సెస్సుకు లోబడి ఉండేవి. అయితే కోవిడ్ సమయంలో రాష్ట్రాల ఆదాయ నష్టాలను భర్తీ చేయడానికి తీసుకున్న రూ.2.69 లక్షల కోట్ల రుణాన్ని జనవరి 31, 2026 నాటికి తిరిగి చెల్లిస్తారు. దీని తరువాత పరిహార సెస్సును దశలవారీగా తొలగిస్తారు. ఈ శూన్యతను పూరించడానికి ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం, ఆరోగ్య సెస్సు తీసుకొచ్చింది.

ఎంత పొడవు ఉంటే అంత పన్ను..

కొత్త నిబంధనల ప్రకారం సిగరెట్ల పొడవు ఆధారంగా పన్ను విధించనున్నారు. 65 మిల్లీమీటర్ల వరకు ఉన్న చిన్న నాన్-ఫిల్టర్ సిగరెట్లకు ఒక్కో స్టిక్ కు సుమారు రూ.2.05 అదనపు సుంకం విధించారు. ఫిల్టర్ సిగరెట్లకు సుమారు రూ.2.10 అదనపు పన్ను, 65 నుండి 70 మిల్లీమీటర్ల కొలతలు కలిగిన సిగరెట్లకు ఒక్కో స్టిక్ కు రూ.3.6 నుండి రూ.4 వరకు పన్ను విధించారు. అయితే 70 నుండి 75 మిల్లీమీటర్ల కొలతలు కలిగిన పొడవైన, ప్రీమియం సిగరెట్లకు ఒక్కో స్టిక్ కు సుమారు రూ.5.4 పన్ను విధించారు. విలక్షణమైన లేదా అసాధారణమైన డిజైన్లతో కూడిన సిగరెట్లకు ఒక్కో స్టిక్ కు గరిష్టంగా రూ.8.50 పన్ను విధించారు.

పొగాకు, గుట్కాపై అధిక భారం

నమలడం పొగాకు, జర్దా, సువాసనగల పొగాకుపై 82 శాతం వరకు ఎక్సైజ్ సుంకం విధిస్తున్నారు. గుట్కాపై ఈ పన్ను 91 శాతానికి చేరుకుంటుంది. పాన్ మసాలాపై 40 శాతం జీఎస్టీ, ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్ విధించారు. మొత్తం పన్ను భారం దాదాపు 88 శాతంగా ఉంది.

ఫిబ్రవరి 1 నుండి పొగాకు ఉత్పత్తులకు MRP ఆధారిత ధరల విధానం అమలు చేయనున్నారు. అంటే ప్యాకేజీపై ముద్రించిన రిటైల్ ధర ఆధారంగా GST నిర్ణయిస్తారు. పాన్ మసాలా తయారీదారులు కొత్త సెస్ చట్టం ప్రకారం కొత్త రిజిస్ట్రేషన్ పొందవలసి ఉంటుంది. అదనంగా ఫ్యాక్టరీలు ప్యాకింగ్ యంత్రాలపై CCTV కెమెరాలను ఏర్పాటు చేయడం, 24 నెలల పాటు రికార్డులను నిర్వహించడం తప్పనిసరి. యంత్రాల సంఖ్య, సామర్థ్యం గురించి సమాచారాన్ని కూడా ఎక్సైజ్ శాఖకు అందించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి