
నగరాల నుంచి గ్రామాల వరకు.. ఎక్కడబట్టినా చిట్టీల గురించి మీరు వినే ఉంటారు. ఇటీవల ఆన్‌లైన్‌లో చిట్టీలు వేసే విధంగా అనేక డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ కూడా వచ్చాయి. ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు, సన్నిహితులు ఒక సుమూహంగా ఏర్పడి చిట్టీలు వేస్తూ ఉంటారు. ఇదే కాకుండా అనేక చిట్ ఫండ్ కంపెనీలు కూడా పుట్టుకొస్తున్నాయి. నెలనెలా చిన్న మొత్తంలో డబ్బులు పొదుపు చేసుకునేందుకు చాలామంది చిట్టీలలో చేరుతూ ఉంటారు. ఇక మరికొంతమంది అవసరానికి డబ్బులు ఒకేసారి సమకూరుతాయనే ఉద్దేశంతో వీటిల్లో చేరతారు. ఇటీవల చిట్టీల ద్వారా డబ్బులు పొదుపు చేసేవారు, అలాగే డబ్బును లోన్ రూపంలో తీసుకునే లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. చిట్టీలపై చాలామందికి అనేక అనుమానాలు ఉంటున్నాయి. కొంతమంది చిట్టీల రూపంలో డబ్బులు కలెక్ట్ చేసిన తర్వాత కనిపించకుండా పోతున్నారు. ఇలాంటి మోసాల వల్ల చిట్టీలపై ప్రజల్లో చాలా భయాలున్నాయి. అసలు చిట్టీల వల్ల లాభాలేంటి..? నష్టాలేంటి..? వీటిల్లో చేరడం మంచిదేనా? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
కొంతమంది ఒక గ్రూపుగా కలిసి నిర్వహించేదే చిట్ ఫండ్. గ్రూపు సభ్యులందరూ జమ చేయగా వచ్చిన డబ్బును గ్రూపులోని ఒక వ్యక్తిగా లోన్ రూపంలో అందిస్తారు. ముందుగానే ఎవరు తీసుకోవాలనేది ఫిక్స్ అవుతారు. ఎక్కువ పోటీ ఉంటే బిడ్డింగ్ నిర్వహిస్తారు. లోన్ తీసుకున్న వ్యక్తి తర్వాతి నెల నుంచి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. చివరి వరకు చిట్టీలో కొనసాగినవారికి వడ్డీ రూపంలో అదనంగా డబ్బు లభిస్తుంది. మొదట్లో డబ్బులు తీసుకునేవారు అదనంగా కట్టాల్సి రావడం వల్ల నష్టం జరుగుతుంది. అదే చివరి వరకు ఉండేవారికి లాభమే. కానీ డబ్బులు అత్యవసరం కావడంతో చాలామంది మధ్యలోనే లోన్ రూపంలో తీసుకుంటారు. ఇలాంటి వారికి నష్టమేనని చెప్పవచ్చు. కానీ అత్యవసంర కావడంతో డబ్బులు తీసుకుంటారు. బ్యాంకుల్లో లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది. అదే చిట్ ఫండ్స్‌లో అలాంటి ఏమీ ఉండవు.
-అత్యవసరమైన సమయంలో డబ్బు వెంటనే చేతికి అందుతుంది
-బయట తీసుకునే లోన్లతో పోలిస్తే చిట్టీలలో వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది
-నెలనెలా డబ్బులు చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకోవచ్చు
-ఎలాంటి డాక్యుమెంటేషన్ ఉండదు
-గ్రూపులోని సభ్యుడు డబ్బులు కట్టకపోతే అందరిపై ప్రభావం పడుతుంది
-అనధికార, రిజిస్టర్ కాని సంస్థల వల్ల చిట్టీ వేస్తే మోసపోయే అవకాశముంటుంది
-మధ్యలో డబ్బులు తీసుకుంటే తర్వాతి నెల నుంచి అదనంగా వడ్డీ చెల్లించాలి